తెలంగాణ (Telangana) రాష్ట్రం వైద్య, ఆరోగ్య రంగంలో నిరుపేదలకు మెరుగైన సేవలందిస్తు దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.ఎల్లారెడ్డి (Ella Reddy) పట్టణంలో నూతనంగా నిర్మించబోయే వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు (Minister Harish Rao), ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రాథమిక వైద్యం మొదలుకుని సూపర్ స్పెషాలిటీ సేవల వరకు తెలంగాణలో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.గతంలో ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా ఉండేది కాదన్నారు.
ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలు (Dialysis centers) ఏర్పాటు చేయడమే కాకుండా డయాలసిస్ పేషెంట్లకు ఉచిత బస్సు పాసు, పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వందకు 63 శాతం డెలివరీలు ప్రభుత్వాసుపత్రిలోనే జరుగుతున్నాయని తెలిపారు.ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తున్నామని తెలిపారు. ఎల్లారెడ్డిలో త్వరలోనే వంద పడకల ఆసుపత్రి భవనం నిర్మించి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(MP Bibi Patil), మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.