TG: గాంధీభవన్ ఎదుట మున్నూరుకాపు నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, పార్టీలో తగిన ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో మున్నురుకాపు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
HYD నగర వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు భారీ ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా HYD పోలీసులు తెలియజేశారు. అత్యవసరమైతే కానీ బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని, ప్రతి ఒక్కరూ తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. భారీ వర్షం కురిసే సమయంలో, చాలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
NDL: డోన్కు సమీపాన పాత నగరవనంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా డీఏ ఐఫ్వో నాగమనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. డోన్ ఫారెస్ట్ రేంజర్ ప్రవీణ్ కుమార్ డోన్ బనగానపల్లె పాణ్యం డీఆర్వోలు జిల్లాలోని అటవీ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో అటవీ అమరవీరులకు ఘనంగా గురువారం నివాళులర్పించారు.
KRNL: కొన్ని నెలల క్రితం ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకుని ఇంటర్వ్యూలు పూర్తి చేసి జిరాక్స్ పత్రాలు సమర్పించినప్పటికీ, ఇప్పటికీ వారి ఖాతాల్లో సబ్సిడీ రుణాలు జమ కాలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్లోని దేవన్నపేటలో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన 15 ఏళ్ల విద్యార్థి జయంత్ కుటుంబసభ్యులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు శుక్రవారం పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన కొండ మల్లయ్య, సందేల సుగణ మరణించగా, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.
GNTR: తెనాలిలోని 17వ వార్డులో ఒకరికి డెంగీ జ్వరం నిర్ధారణ అయింది. అబ్దుల్ అనే వ్యక్తికి గుంటూరు జీజీహెచ్లో నిర్వహించిన రక్త పరీక్షల్లో డెంగీ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమై 17వ వార్డులో శుక్రవారం ఉదయం బ్లీచింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేయించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ (MHO) సూచించారు.
AKP: మండల కేంద్రమైన మునగపాక సచివాలయం వద్ద శుక్రవారం ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అనువుగా ఉండే విధంగా ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించిందని తెలిపారు. కార్డుల్లో పొరపాట్లు తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉందన్నారు.
AP: జగన్ పరదాల చాటున తిరిగేవారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఎరువుల పేరుతో జగన్ రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. అవసరం మేరకు యూరియా ఇస్తున్నట్లు తెలిపారు. జగన్ కావాలనే జనాన్ని రెచ్చగొడుతున్నారని.. మెడికల్ కాలేజీలపై నీచమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము సంయమనంతో ఉన్నాం కాబట్టే వైసీపీ నేతలు ఇంకా రోడ్లపై తిరుగుతున్నారని పేర్కొన్నారు.
ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత తన వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. రాజకీయాల్లో బిజీబిజీగా గడిపే ఆమె శుక్రవారం వెంకటాపురంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పంటలపై ఆరా తీశారు. అనంతరం వ్యవసాయ క్షేత్రాన్ని మొత్తం కలియతిరిగారు. పంటకు సమయానికి నీరు, రసాయన మందులు, ఎరువులు వేయాలని కూలీలకు సూచించారు.
KRNL: దేవనకొండ మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 8 నెలల కుమారుడిని హత్య చేసి, భార్యపై భర్త దాడి చేసిన ఘటనలో ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు మండిపడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం దేవనకొండ బస్టాండ్ వద్ద పోలీస్ డౌన్.. డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసన తెలిపారు. నిరసనకారుల రోడ్డుబ్లాక్ వల్ల వాహనాల రాకపోకలు అంతరాయమయ్యాయి.
AKP: అచ్యుతాపురం జడ్పీ హైస్కూల్లో రూ.18.50 లక్షలతో కొత్తగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
KMM: మధిరలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నిరవధిక సమ్మెను చేపట్టారు. వర్కర్లను పర్మినెంట్ చేయాలని, టైం స్కేల్ పెంచాలని, జిల్లా కలెక్టర్ గెజిటెడ్ ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
CTR: శక్తి క్షేత్రంగా విరాజల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ దసరా మహోత్సవాలు ఈనెల 23న ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా పుంగనూరుకు విచ్చేసిన స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వాములవారిని ఆలయ ఈవో ఏకాంబరం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమ్మవారి కుంకుమ ప్రసాదాలను అందజేసి దసరా మహోత్సవాలకు ఆహ్వానం పలికారు.
KRNL: తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1626.06 అడుగులకు చేరింది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం నీటి నిల్వ 80.003 టీఎంసీలకు చేరింది. డ్యామ్ ఇన్ ఫ్లో 13,779 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 16,995 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.