VZM: ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మంగళవారం గంట్యాడలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని రాజుల పొల్లంకిలోని కర్రివాని చెరువు వద్ద ఉపాధి హామీ పనులకు వెళ్లిన సన్యాసిరాజు పని ప్రదేశంలో కుప్పకూలాడు. శ్రామికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సన్యసిరాజును పరీక్షించగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్థారించారు.
MDCL: ఖైతలాపూర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. అమృత్‌నగర్ తండాకు చెందిన 62 మంది నిరుపేదలకు బుధవారం ఇళ్ల పంపిణీ జరగనున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. గతంలో లాటరీ ద్వారా 67 మందికి ఇళ్లు కేటాయించగా, మిగతా 62 మందికి ఇక్కడే ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు.
GNTR: దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం నిర్వహించిన వేలంలో పసుపు ధరలు స్థిరంగా కొనసాగాయి. క్వింటా పసుపు గరిష్ఠ ధర రూ.11,200 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రకాల వారీగా చూస్తే.. పసుపు కొమ్ములు రూ.9,950 నుంచి రూ.11,200 వరకు, అలాగే కాయ రకం పసుపు రూ.10,950 నుంచి రూ.11,025 వరకు పలికినట్లు వెల్లడించారు.
SRD: సంగారెడ్డి కలెక్టరేట్లో దివ్యాంగుల సహకార సంస్థ రాష్ట్ర ఛైర్మన్ వీరయ్య దివ్యాంగులకు ఉచిత స్కూటీలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో డిగ్రీ చదివిన వారికే స్కూటీలు ఇచ్చేవారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 10వ తరగతి అర్హత ఉన్నవారికే వీటిని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.
ATP: శింగనమల నియోజకవర్గ పరిశీలకుడు మన్నె సుబ్బారెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిని కలిశారు. ఆయనను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. పార్టీ బలోపేతానికి, రాబోయే కార్యక్రమాల విజయవంతానికి క్యాడర్ అంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
SS: బక్రీద్ వేళ జిల్లాలో పొట్టేళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణ ధరల కన్నా ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువకు పొట్టేళ్లు అమ్ముడు పోతున్నాయి. మాములు రోజుల్లో రూ.10 నుంచి రూ.15 వేలు పలికే పొట్టేళ్ల ధర.. బక్రీద్ డిమాండ్ కారణంగా రూ.30 నుంచి రూ.50 వేలకు పెరిగింది. మెలి తిరిగిన కొమ్ములు బలిష్టంగా ఉన్న పొట్టేళ్లు, మేకపోతుల ధర మరింత ఎక్కువగా ఉంటోంది.
KKD: పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగిన నిధుల అవకతవకలపై ప్రభుత్వం మంగళవారం కఠిన చర్యలు చేపట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నుంచి 55 పనుల నిర్వహణకు రూ.773 లక్షలు మంజూరయ్యాయి. అందులో కొన్ని పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని, పనుల్లో నాణ్యత లేదని విచారణలో అధికారులు నిర్ధారించారు. బాధ్యులకు నోటీసులు జారీ చేశారు.
CTR: సదుం PSలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో గిరిబాబు మరణించారు. ఆయన సతీమణి శాంతికి లక్ష రూపాయల IDRF ఫండ్ చెక్‌ను ఎస్సీ తుషార్ మంగళవారం అందజేశారు. అలాగే సోమల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ బైక్ యాక్సిడెంట్‌కు గురైన పీసీ రమేష్‌కు రూ. 30 వేల చెక్కును ఎస్పీ అందించారు. పోలీస్ శాఖ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
BSNL వార్షికాదాయం రూ.25,000 కోట్లకు చేరినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడించారు. సంస్థ ఆదాయం 2024-25లో రూ.23,427 కోట్లు కాగా, 2025-26లో రూ.25,000 కోట్లు మించిందని చెప్పారు. ఇదే సమయంలో ఎబిటా రూ.50 కోట్ల నుంచి రూ.7,000 కోట్లకు సమీపించినట్లు తెలిపారు. నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, ఇతర సంస్థల కంటే తక్కువ టారిఫ్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
TG: జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను 10 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అంచనా వేయగా, ఇప్పటివరకు 3.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రాష్ట్రంలోనే 4వ స్థానంలో ఉందని తెలిపారు. రవాణాకు 862 లారీలు, 233 డీసీఎంలు, 297 ట్రాక్టర్లు వాడుతున్నట్లు కలెక్టర్ సత్యప్...
NLR: చేజర్ల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయంను నెల్లూరు అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోడీ శంకరనారాయణ మంగళవారం సందర్శించారు. ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో నకిలీ ఉపాధి హామీ కూలీలు అంటూ వచ్చిన కథనం మేరకు ఆయన సందర్శించడం జరిగింది అని తెలిపారు. ఆయన పలు రికార్డులను తనిఖీ చేసారు. చేజర్ల ఏపీఓకి నోటీసులు జారీ చేశారు.
KRNL: ఆదోని వీఆర్వో సురేశ్ కిడ్నాప్ కేసు ఆరోపణలపై పారిశ్రామికవేత్త బత్తిని కుబేర్నాథ్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. తమ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల వివాదాన్ని వాల్మీకి సోదరులు అపార్థం చేసుకుని కిడ్నాప్‌గా ప్రచారం చేశారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో తాను చేసిన సేవలను గుర్తు చేశారు. వాల్మీకి సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పారు.
SRD: జహీరాబాద్ పట్టణంలో పలు వార్డులలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. నాలాలు చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలు పిచ్చి మొక్కలతో మూసుకుపోయి మురికి నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో దుర్వాసన వ్యాపిస్తూ రోగాల భయం నెలకొంది. వర్షాలకు ముందే డ్రైనేజీలు శుభ్రం చేసి ఉంచాలని స్థానికులు ప్రజలు కోరుతున్నారు.
SDPT: బెజ్జంకి మండలంలో రైతుల నుంచి అధిక తూకంతో ధాన్యం కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని CPM నేతలు తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. బస్తాకు 42 కిలోలుగా తూకం వేయాలని మిల్లర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారని మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ఆరోపించారు. IKP అధికారుల సహకారంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
TG: మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ తహశీల్దార్ సుచరిత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తన డ్రైవర్ ద్వారా ఆమె ఈ లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.