NRML: కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈరోజు రాత్రి వరద గేట్లు తెరిచి నీటిని వదిలే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. నది పరివాహక ప్రాంతం దిగువన పశువులు, పల్లెకారులు, గొర్రె కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
KMR: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ‘ఐకేపీ’ ద్వారా రుణాలు అందిస్తున్నట్లు ఐకేపీ డీపీఎం రాజయ్య తెలిపారు. బిక్కనూరు మండలంలో 673 ఇళ్లు మంజూరయ్యాయని, అందులో 95 మంది డ్వాక్రా మహిళలకు రూ.1.17 కోట్ల రుణాలు అందించామని ఆయన చెప్పారు. ప్రతి మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండాలని సూచించారు. ఇది మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడుతుందని ఆయన అన్నారు.
NLR: బోగోలు మండలంలోని సచివాలయ ఉద్యోగులకు అధికంగా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో తాము ఒత్తిడికి గురవుతున్నామని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బోగోలు జూనియర్ అసిస్టెంట్ సరితకి వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. GSWS శాఖలో పని చేస్తున్న ఉద్యోగస్థులకు, మిగతా ప్రభుత్వ ఉద్యోగస్థులకు చాలా తేడా ఉందని వారు తెలియజేశారు.
MLG: ఏటూరునాగారం మండలం కేంద్రంలోని కొండై గ్రామం నుంచి ఊరటం వెళ్లే మట్టి రహదారి గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇవాళ గ్రామస్థులు ఐకమత్యంతో చెక్కలు, మట్టితో తాత్కాలికంగా రోడ్డును బాగుచేశారు. ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతోందని, అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ప్రకాశం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఇవాళ కనిగిరి మున్సిపల్ పరిధిలోని శంఖవరం ఎస్సీ కాలనీకి చెందిన చెంచాల సరోజనమ్మకి ముఖ్యమంత్రి సహాయక నిధి LOC ద్వారా రూ. 1,50,000 చెక్కును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు.
గద్వాలలోని హమాలీ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ. నర్మద మాట్లాడుతూ.. కాలనీలో వీధి లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వినతిలో పేర్కొన్నట్లు తెలిపారు.
TPT: శ్రీ కాళహస్తిలోని SKIT కళాశాలను MLA బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి JNTU వీసీ శుక్రవారం సందర్శించారు. ఇందులో భాగంగా తరగతులు ప్రారంభించుటకు గల సన్నాహాకాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసంపూర్తిగా మిగిలిన భవనాలను సకాలంలో నిర్మించాలని సిబ్బందికి సూచించారు. క్లాసులు ప్రారంభించడానికి ప్రభుత్వం పరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
SKLM: కంచిలి మండలంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ నాయకులు శుక్రవారం తహసీల్దార్ ఎన్. రమేష్ కుమార్‌కి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ కంచిలి మండలం అధ్యక్షులు కార్యదర్శి రెళ్ల కామరాజు తదితరులు పాల్గొన్నారు.
JGL: కొడిమ్యాల మండలంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం పర్యటించారు. ముందుగా స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో మండలానికి చెందిన 46 ముఖ్యమంత్రి సహాయ నిధి రూ. 12,16,500విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందించారు, తరువాత కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే SGF అండర్-14, అండర్-17 క్రీడలను ప్రారంభించారు.
ప్రకాశం: కనిగిరి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో జరుగుతున్న వైద్య శిబిరాన్ని ఎంపీడీవో ప్రభాకర్ శర్మ ఇవాళ పరిశీలించారు. జ్వరాల బారిన పడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గ్రామంలో చేపట్టిన వ్యాధుల నివారణ చర్యలను, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. విషజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి జాగ్రత్త వహించాలన్నారు.
కృష్ణా: ఉంగుటూరు మండలంలో పలు ప్రాంతాల్లో కరెంట్ ఉండదని విద్యుత్ అధికారులు తెలిపారు. మండలలోని ఇందుపల్లి, వేమండ, నందమూరు, మానికొండ, చాగంటిపాడు, చికినాల, బొకినాల, మదిరిపాడు గ్రామాల్లో కరెంట్ శనివారం ఉదయం 8 – 11 గంటల వరకు కరెంటు ఆపివేయనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు పెద్ద అవుటపల్లిలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అంతరాయం ఉండునున్నట్లు పేర్కొన్నారు.
KDP: ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరులోని మున్సిపల్ హైస్కూల్లో చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవెలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి, ఎయిడ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
KMM: గిరిజన వసతి గృహాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, శుక్రవారం ఖమ్మం నగరంలోని గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయం ఎదుట కార్మికులు, ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో, ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని తెలిపారు.
BHNG: సర్వాయి పాపన్న మోకు దెబ్బ గీత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన బైరి విశ్వనాథం గౌడ్‌ను ఎంపిక చేశారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జెక్కే వీరస్వామి శుక్రవారం నియామక పత్రం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా విశ్వనాథం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
SKLM: జిల్లాలో వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తామని వైసీపీ నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. గురువారం జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన చింతం రాంబాబుకు భరోసా కల్పించారు. శుక్రవారం ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల ఆదుకుంటామని పేర్కొన్నారు.