KKD: పిఠాపురం మండలం వెల్దుర్తిలో రైతులు రింగ్ మోడల్ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక మందులు వాడకుండా, ఎరువులతో బీర, కాకర, బెండ, వంగతో పాటు పది రకాల ఆకుకూరలు పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్యవసాయ పద్ధతి అందరినీ ఆకట్టుకుంటోంది.
NRML: శిశువులకు తల్లిపాలు అత్యుత్తమ ఆహారం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం నిర్మల్ ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి బేబీ ఫీడింగ్ రూమ్ను ఆయన ప్రారంభించారు. తల్లిపాలు శిశువుల రోగనిరోధక శక్తిని పెంచుతాయని, తల్లులకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
BDK: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ఉదయం 8 గంటలకు 43 అడుగులకు ఉండగా, మధ్యాహ్నం 12 గంటలకి 44.4 అడుగులకు చేరింది. కాగా, 43 అడుగుల వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
SRD: పని ప్రదేశాలలో మహిళలను వేధిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని షీటీం ఏఎస్సై తులసిరాం హెచ్చరించారు. ఖేడ్ పట్టణంలోని బసవేశ్వర చౌక్ వద్ద కూలీలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఆన్ లైన్ ఓటీపీలు చెప్పవద్దని, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో WPC చాంగు బాయి పాల్గొన్నారు.
PPM: గరుగుబిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 26వ తేదీన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.పైడితల్లి ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఎంపీపీ ఉరిటి రామారావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సర్పంచ్లు, ఎంపీటీసీలంతా హాజరవుతున్నారని, మండల స్థాయి అధికారులు పూర్తి అభివృద్ధి నివేదికలతో హాజరుకావాలని కోరారు.
NRML: జిల్లా ఉపాధికల్పన కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి గోవిందు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్బిఐ లైఫ్, పేటీఎం సర్వీసెస్లో ఉద్యోగాలు ఉన్నాయని, పదవ తరగతి పైబడిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KNR: చొప్పదండి మండలంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు భద్రత, బందోబస్తు కోసం ఆన్లైన్ నమోదు తప్పనిసరి అని SI నరేష్ రెడ్డి తెలిపారు. policeportal.tspolice.gov.in పోర్టల్ వివరాలు నమోదు చేసి, అప్లికేషన్ను పోలీస్ స్టేషన్లో అందజేయాలని సూచించారు. సందేహాలుంటే పోలీస్ స్టేషన్ను సంప్రదించవచ్చని లేదా 100కు ఫోన్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రాజెక్టులను ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావటంతో సందడి నెలకొంది. దీంతో అధికారులు పర్యాటకులను అప్రమత్తం చేశారు. నీటికి అతి దగ్గరగా వెళ్లి సెల్ఫీలు దిగవద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
CTR: వెంగళరావు కాలనీలో ప్రపంచ దోమల నివారణ దినోత్సవం నిర్వహించారు. అడిషనల్ DMHO వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. దోమల వ్యాప్తితో జరిగే అనర్థాలను వివరించారు. దోమకాటుతో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు వస్తాయని.. జాగ్రత్తలు పాటించాలని MHO లోకేష్, మలేరియా అధికారి వేణుగోపాల్ కోరారు.
ADB: ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో బుధవారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ మాట్లాడుతూ.. చిన్న వయసులో ప్రధానమంత్రిగా ఎన్నికై దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన రాజీవ్ గాంధీని ప్రజలు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారన్నారు.
SRCL: గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టువద్ద బుధవారం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేలు పూజలు నిర్వహించారు. ఎగువ మానేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో మత్తడి దూకుతోంది. ఎగువ మానేరు ప్రాజెక్టులోకి కూడెల్లివాగు, పాల్వంచ వాగుల నుంచి వరదనీరు రావడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది.
KMR: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పిట్లం మండలం చిన్న కొడపల్ శివారులోని ఎల్లయ్య చెరువు ఆయకట్టులో ముంపునకు గురైన పంటలను ఏఈవో సురేష్ పరిశీలించారు. యువ రైతులతో కలిసి పొలాల్లో పర్యటించారు. వరదలకు నష్టపోయిన పత్తి, సోయా పంటలను క్షుణ్ణంగా పరిశీలించారు. పంట నష్టానికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.
KNR: 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలువకుంట రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆసక్తిగల అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 10లోగా తమ దరఖాస్తులను తెలుగు విభాగంలో సమర్పించాలని అన్నారు.
BDK: గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరుకుని క్రమేపీ పెరుగుతూ.. ఉదృతంగా ప్రవహిస్తుదని ఐటీడీఏ పీవో బి రాహుల్ అన్నారు. ఈ నేపథ్యంలో గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగులు, వంకల వద్దకు వీడియోల కోసం, సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు.
NDL: కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి బుధవారం ఉదయం శ్రీశైలం డ్యాంకు 4,19,571 క్యూసెక్కుల వరద నీరు చేరింది.ఉదయం 9 గంటల 10 గేట్లు ద్వారా 4,11,237 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేశారు. డ్యాం నీటిమట్టం 882.10 అడుగులు సామర్థ్యం 261.768 టీఎంసీలు నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.