KKD: శంఖవరం మండలం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతీ ఆదివారం జరిగే రధోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు స్వయంగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. వారాంతం కావడంతో రత్నగిరి క్షేత్రానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు రధోత్సవ సేవను తిలకించి పునీతులయ్యారు. ఉదయం నుండచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేరళలో అయ్యప్ప దర్శనాలు జరుగుతున్న వేళ బ్రెయిన్ ఫీవర్ టెన్షన్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసే వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కాగా, కేరళలో నవంబర్ నెలలోనే 17 మంది ఈ వ్యాధి బారినపడగా.. వారిలో 8 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తొలి వారంలోనే ఏకంగా 5.75 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు ప్రకటించారు. శనివారం ఒక్కరోజు సాయంత్రానికే 72 వేలమందికి పైగా భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. రద్దీ నిర్వహణ, సౌకర్యాలపై ట్రావెన్కోర్ బోర్డు అధికారులతో మంత్రి వీఎన్ వాసవన్ ప్రత్యేకంగా సమావేశమై సమీక్షించారు.
కోనసీమ: అమలాపురం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు మార్గశిర మాసం శుక్ల విదియ శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తులకు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,86,015 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 286 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 11 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. 2,816 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో స్వామివారి మూలమూర్తికి పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో స్వామికి సింధూరం, ఆకుపూజ, మహా మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం డి. హిరేహాల్ మండలంలోని మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడికి పురోహితులు పవన్ కుమార్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారికి పంచామృతం, కుంకుమ అర్చనలు చేపట్టి పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర రాష్ట్రం నుంచి సైతం భక్తులు పాల్గొని, దర్శించుకున్నారు.
కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. స్పాట్ బుకింగ్ పెంచుకునేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. భక్తుల రద్దీని బట్టి బుకింగ్ పెంచుకోవచ్చని సూచించింది. అయితే, భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు పేర్కొంది.
AP: విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులకు దేవాదాయశాఖ అధికారులు సౌకర్యాలు కల్పించారు. మాసోత్సవాల్లో దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పోలి పాడ్యమి కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
AP: ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహిళలు పుణ్యస్నానాలు చేసి అమరావతి ఘాట్ వద్ద నదిలో దీపాలు వదులుతున్నారు. తొలి పాడ్యమి రోజు భక్తులతో సీతానగరం కిటకిలాడుతోంది. నదిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
KKD: కార్తీక మాసం ముగింపు పురస్కరించుకుని అమావాస్య కావడంతో సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో అఖండ కోటి దీపారాధన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ఆలయంలో ప్రమిదలతో దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ATP: కార్తీక అమావాస్య సందర్భంగా తాడిపత్రిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం స్వామివారికి భస్మాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. ఉజ్జయిని తరహాలో చేసిన ఈ అలంకరణలో స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు డిసెంబర్ 14 నుంచి 2026 మార్చి 16 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేష్ తెలిపారు. డిసెంబర్ 14న దృష్టి కుంభం, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. 15న లక్ష బిల్వార్చన, జనవరి 18న మొదటి ఆదివారం, ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, పెద్దపట్నం ఉంటుందని వివరించారు.