HYD: ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా DGP శివధర్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. మెస్సీ సాయంత్రం 7.15 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారని తెలిపారు. మ్యాచ్ మొత్తం 20 నిమిషాల పాటు జరుగుతుందని చెప్పారు. చివరి 5 నిమిషాల్లో CM, మెస్సీ కలిసి మ్యాచ్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
MDK: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని 750 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ DV శ్రీనివాసరావు పేర్కొన్నారు. చేగుంట పోలీస్ స్టేషన్లో ఎన్నికల అవగాహన కార్యక్రమం చేపట్టారు. గర్భిణీ మహిళలు, వృద్ధులు వికలాంగులు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
NZB: రుద్రూర్ గ్రామ సర్పంచ్గా గెలుపొందిన ఇందూరు సునీత-ఇందూరు చంద్రశేఖర్ దంపతులు నేడు శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారి విజయాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ, శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. సర్పంచ్ దంపతులకు శాలువా, పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
WNP: ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని శనివారం కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఫారం-14 దరఖాస్తు చేసుకున్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలని, ఎన్నికల విధుల అపాయింట్మెంట్ ఆర్డర్ లేదా మరో గుర్తింపు కార్డు జిరాక్స్ తనిఖీ చేయాలన్నారు.
NLG: జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాలలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న ప్రాతంల్లో శనివారం ఆమె పర్యటించారు. మాడుగుల పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.
KMM: కూసుమంచి మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీలకు గాను ఆరు ఏకగ్రీవం కాగా మిగిలిన 35 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 45 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
NRPT: నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి (కాంగ్రెస్), పాలమూరు ఎంపీ డీకే అరుణ (బీజేపీ)ల స్వగ్రామం ధన్వాడలో సర్పంచ్ ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. 8,327 వేల ఓట్లు గల ఈ గ్రామంలో కాంగ్రెస్ నుంచి సీ.జ్యోతి, బీజేపీ నుంచి పీ.జ్యోతి బరిలో నిలిచారు. వీరితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు.
ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి అధ్యక్షుడు సోయం బాపురావ్ అన్నారు. శనివారం బజార్ హత్నూర్ మండలంలోని దేగామ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామంలో అభివృద్ది జరుగుతుందన్నారు.
KNR: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. శనివారం తిమ్మాపూర్ మండల ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, డీపీఓ జగదీశ్వర్, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్రా, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పోలింగ్ ఆర్ఆర్లు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశారు.
NLG: శివనేనిగూడెం గ్రామ సర్పంచ్గా స్వర్గీయ నాగిళ్ల యాదయ్య గ్రామాన్ని అభివృద్ధి పరిచారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి సర్పంచిగా గెలుపొంది ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. శనివారం యాదయ్య వర్ధంతి సందర్భంగా గ్రామంలోని విగ్రహానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.
MDK: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. తూప్రాన్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని సిబ్బందికి సూచనలు సలహాలను అందజేశారు. మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, అదే విధంగా రెండో విడత ఎన్నికలు సజావుగా జరిగేటట్టు కృషి చేయాలని ఆయన సూచించారు.
MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో కొంతమంది అభ్యర్థులు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఒక్క ఓటుకు 500 వరకు డబ్బు, ప్రతి ఇంటికి మందు పంపిణీ చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాలపై అధికారులు ,పోలీసులు నిగ్గు ఉంచాలని సూచిస్తున్నారు.
ADB: జైనథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిప్యూటీ కలెక్టర్ వంశీ, తహసీల్దార్ నారాయణ ఎంపీడీఓ సుధీర్, రిటర్నింగ్, ఇతర అధికారుల సిబ్బంది తదితరులు ఉన్నారు.
NZB: సింగరేణి కార్మికుల కష్టార్జితం రూ. 100 కోట్లు ప్రైవేటు ఫుట్బాల్ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ కోసం వినియోగించడం దారుణమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇది హైదరాబాద్ ప్రతిష్టను పెంచే కార్యక్రమం కాదని, ‘కోట్లు కొల్లగొట్టే పేమెంట్’ అని విమర్శించారు. “సొమ్ము సింగరేణిది, సోకు రేవంత్ రెడ్డిది” అని దుయ్యబట్టారు.