• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

ASF: ఆసీఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని సోమవారం అయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, కొత్తగా ఏర్పడిన ఆసీఫాబాద్ మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని డిప్యూటీ CM హామీ ఇచ్చారని MLA తెలిపారు.

July 7, 2025 / 04:35 PM IST

‘8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి’

MNCL: రాష్ట్రంలో పనిగంటలు పెంచుతూ రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లి RDOకి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నాం అంటూనే పని గంటలను పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు.

July 7, 2025 / 03:08 PM IST

పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

NRML: పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్‌కు వినతి పత్రాలు సమర్పించారు. దరఖాస్తుదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

July 7, 2025 / 02:53 PM IST

ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ సీఐ

NRML: నర్సాపూర్ మండలం చాకెపల్లి గ్రామంలో సోమవారం ఈత వనం కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ సీఐ నజీర్ హుసేన్ ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ జాదవ్ వెంకటి, గౌడ కులస్తులు పాల్గొన్నారు.

July 7, 2025 / 02:49 PM IST

కలకలం రేపుతున్న పులి సంచారం

BDK:పాల్వంచ మండలం పాండురంగాపురం ఏరియాలో పులి సంచారం కలకలం రేపింది. నరసమ్మ తల్లి ఆలయ సమీపంలో కొత్త పోడుకు కొందరు జామాయిల్ చేనుకు వెళ్లి ట్రాక్టర్‌పై తిరిగి వస్తుండగా కొంగను తరుముతూ, పులి ట్రాక్టర్‌కు అడ్డు వచ్చిందని స్థానికులు తెలిపారు.  వారు కేకలు వేయడంతో పారిపోయిందని ఫారెస్ట్ అధికారులకు చెప్పడంతో ఆ ప్రాంతానికి వెళ్లి అధికారులు పాదముద్రలు సేకరిస్తున్నారు.

July 7, 2025 / 11:20 AM IST

అశ్వపురంలో MRPS ఆవిర్భావ వేడుక

BDK: అశ్వాపురం మండలం జగ్జీవన్ రామ్ కాలనీ‌లో సోమవారం MRPS ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా MRPS నాయకులు ఈసంపల్లి కృష్ణ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాదిగ అమరవీరులను స్మరించుకున్నారు. వారు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ఏ, బీ, సీ, డీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేశామని పేర్కొన్నారు.

July 7, 2025 / 11:16 AM IST

ఆత్మకూరులో బిఆర్ఎస్ నేతల అరెస్టు

HNK: BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని ఆత్మకూరు పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ తలపెట్టిన నిరసనకు హాజరయ్యేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి రాకేష్ రెడ్డి బయలుదేరారు. ఈ క్రమంలో ఆత్మకూరు మండలంలో పోలీసులు వారిని అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. పోలీస్ యాక్ట్‌ను సాకుగా చూపి తమను అడ్డుకున్నట్టు వారు మండిపడ్డారు.

July 7, 2025 / 11:02 AM IST

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణకు ఆహ్వానం

PDPL: జిల్లాలో ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ తెలిపింది. ఈ కోర్సులకు జ్యోతినగర్, NTPC, గోదావరిఖనిలో ఈ శిక్షణ ఇస్తారు. ఇంటర్ పాసైన యువత దీనికి అర్హులు, ఆసక్తిగల అభ్యర్థులు జూలై 8 లోపు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయ గది నం. 114లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.

July 7, 2025 / 10:54 AM IST

‘పులి కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

ASF: పులి కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. తిర్యాణి మండలంలోని ఎదులపహాడ్ అటవీ శివారులో తరచూ పులి కదలికలు ఉన్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ప్రజలకు పులి సంచారంపై అవగాహన కల్పిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఎక్కడైనా పులి సంచరిస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

July 7, 2025 / 08:29 AM IST

ఉమ్మడి పాలమూరు గిరిజనులకు శుభవార్త

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన నియోజకవర్గాలకు మొత్తం 8,750 ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,319 ఇళ్లు శాంక్షన్ చేసినట్లు తెలిపింది. ఈ లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అచ్చంపేటలోని మున్ననూర్‌లో మంజూరు పత్రాలను ఇవ్వనున్నారు.

July 7, 2025 / 08:18 AM IST

‘మహాలక్ష్మి’ పథకానికి నోచుకోని రామకృష్ణాపూర్ మహిళలు

MNCL: జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో రామకృష్ణాపూర్ పట్టణానికి RTC బస్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే గేటు సాకుతో దశాబ్దాలుగా బస్సు నడవలేదు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా అదే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఆటోలే దిక్కవుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మికి స్థానిక మహిళలు నోచుకోలేదు.

July 7, 2025 / 08:16 AM IST

నిలిచిన ఇసుక రవాణా.. భవన నిర్మాణ రంగంపై ప్రభావం

MNCL: జిల్లాలో 12 రోజులుగా ఇసుక రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో భవన నిర్మాణ రంగంపై ప్రభావం పడింది. ఇళ్ల నిర్మాణాలతోపాటు ఇందిరమ్మ పథకానికి ఇసుక దొరకడం లేదు. ఫలితంగా, రోజువారీ కూలీలు, ట్రాక్టర్ యజమానులు, కాంట్రాక్టర్లు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 400 ట్రిప్పుల ఇసుక బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి.

July 7, 2025 / 08:12 AM IST

షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

MLG: జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) ఆధ్వర్యంలో నిర్వహించే షార్ట్ ఫిలిం పోటీలకు అన్ని వర్గాల ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మానవ హక్కులపై అవగాహన కల్పించే విధంగా 3 నుంచి 10 నిమిషాల షార్ట్ ఫిలింను nhrcshrotfilm@gmail .comకు పంపించాలన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, బహుమతి రూ.2 లక్షలు అందిస్తారన్నారు.

July 7, 2025 / 08:04 AM IST

శాకాంబరీ ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారి దర్శనం

WGL: వరంగల్ భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న శాకాంబరీ మహోత్సవాల్లో భాగంగా పన్నెండవ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం ద్వాదశి తిథి సోమవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

July 7, 2025 / 07:56 AM IST

ఈనెల 9న వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ నెల 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు మండల లెవల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎస్సై సర్తాజ్ పాషా ప్రకటనలో తెలిపారు. బెజ్జూర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగల యువకులు పోలీస్ స్టేషన్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని SI సూచించారు.

July 7, 2025 / 07:44 AM IST