WNP: వరి కోత మిషన్‌లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం పెద్దమందడి మండలంలో చోటు చేసుకున్నది. స్థానికుల వివరాలు.. అంకూరు గ్రామానికి చెందిన రాకాసి శ్రీనివాస్ రెడ్డి (45) జంగమయ్య పల్లి గ్రామ సమీపంలోని పొలంలో పంటను కోసే క్రమంలో ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRPT: హుజూర్ నగర్ మండల నూతన తహసీల్దార్‌గా బండ కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గరిడేపల్లి నుంచి ఆమె బదిలీపై హుజూర్ నగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటు రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
NGKL: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కొల్లాపూర్ మండలంలోని సోమశిల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు, పిల్లలు తెల్లవారుజాము నుంచే చలిని తట్టుకుని కృష్ణా నదిలో స్నానం చేసి, కార్తీక దీపాలను నదిలో వదిలారు. అనంతరం లలితాంబిక సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
MDCL: ప్రగతినగర్ చెరువు సరిహద్దులను అధికారికంగా సర్వే చేసి నిర్ధారించాలని ప్రగతినగర్ లేక్‌వ్యూ కాలనీ సంక్షేమ సంఘం హైడ్రాకు విజ్ఞప్తి చేసింది. ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇష్టానుసారం సర్వే చేసి హద్దులు ఖరారు చేస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
NGKL: వటువర్లపల్లిలో పునరావాసం కొనసాగుతున్నప్పటికీ, చాలా మంది గ్రామస్థులు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పునరావాసం పేరుతో గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ సంతోష్‌కు అర్జీ ఇచ్చిన గ్రామ ప్రజలు పునరావాసంపై త్వరగా స్పష్టత ఇచ్చి, గ్రామ అభివృద్ధి పనులు ఆగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
NZB: విద్యార్థుల కోసం చేసే వంటల్లో నాణ్యత లేని వస్తువులు వాడుతున్నారని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు సోమవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు చందాల కోసం కాంట్రాక్టర్‌తో చేతులు కలిపి నాసిరకం వస్తువులను తీసుకొచ్చి వంటల్లో వాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు.
ADB: జిల్లాలో ఆన్లైన్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సోమరాజేశ్వర్ ఇవాళ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ఆన్లైన్ ఎంట్రీలు, FRS తదితర విద్యా సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఎంట్రీలను వెంటనే ముగించే దిశగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
KNR: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరం పీజీ కోర్సుల్లో ఖాళీల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ తెలిపారు. ఎమ్మెస్సీ బోటనీ, జువాలజీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ నెల 18వ తేదిన అడ్మిషన్లు పొందే విద్యార్థులు నిర్ణీత కోర్సు ఫీజు, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు.
NRPT: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ప్రోత్సహించి, వారికి మంజూరైన ఇళ్లను త్వరితగతిన నిర్మించుకునేలా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నర్వ మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, నర్వ యాస్పిరేషన్ బ్లాక్‌పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇళ్ల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
KMR: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో మాజీ ఐఏఎస్ అధికారి, రాజకీయ విశ్లేషకులు జయప్రకాశ్ నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే, జయప్రకాశ్ నారాయణ స్థాపించిన ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ కార్యాలయంలో పరిశోధన విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్నారు. డబ్బు,మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించడంపై ఆయన విద్యార్థులకు వివరించారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని గచ్చుబావి వద్ద ఉన్న శివాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన మహా రుద్రాభిషేకం కార్యక్రమంలో బీజేపీ నేత తల్లోజు ఆచారి పాల్గొన్నారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఎంతో పురాతనమైన గచ్చుబావిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని తెలిపారు.
KNR: TDP సీనియర్ నేత, ఎన్టీఆర్ వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య మరణం విచారకరమని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు X లో ట్వీట్ చేశారు. TDP ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తోన్న ఆగయ్యను ఈ మధ్యనే మహానాడు వేదికగా తాను, బాలకృష్ణ సత్కరించుకున్నామన్నారు. ఎంతో అంకితభావంతో పార్టీకి కోసం పనిచేసిన ఆగయ్య కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
KMM: సత్తుపల్లి మండలంలోని యాతాలకుంటలో సీతారామ ఎత్తిపోతల పథకం 9వ ప్యాకేజీలో భాగమైన టన్నెల్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం పరిశీలించారు. సీతారామ ఎత్తిపోతల పథకం ఖమ్మంలో నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ స్థిరీకరణ చేస్తూ కొత్తగా మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ల కోసం కేసీఆర్ డిజైన్ చేశారని అన్నారు.
WNP: పెబ్బేరు మండలంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సుగూరుకి చెందిన చనమోని రమేష్ సోమవారం పొలం నుంచి ఇంటికి తిరిగి రాగా భార్య కవిత, కూతురు ఐశ్వర్య (5), కొడుకు శివం తేజ్ (3) కనిపించలేదు. తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
HYD: జపాన్‌లో జరిగిన డెఫ్లింపిక్స్లో 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణపతకం సాధించిన HYD షూటర్ ధనుష్ శ్రీకాంత్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. సంకల్పం ఎదురు వచ్చే ప్రతి అడ్డంకిని జయిస్తుందని ధనుష్ నిరూపించాడని, యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలిచాడని చెప్పారు.