సత్యసాయి: నల్లమాడలో సోమవారం జరిగిన ఎమ్మెల్యే పల్లె సింధూరమ్మ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఫైనల్లో గెలిచిన కొండకమర్ల జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన క్రీడాకారులకు నగదు బహుమతులు, మెడల్స్ అందజేశారు. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
GNTR: చర్లపల్లి–నాగర్‌కోయిల్ మధ్య గుంటూరు మీదుగా అమృత్ భారత్ స్లీపర్ రైలును కేంద్రం ప్రకటించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. తొలుత వారానికి ఒక రోజు నడపనున్నారు. ఆదరణను బట్టి ఫ్రీక్వెన్సీ పెంచుతారు. ఈ రైలు గుంటూరు ప్రజలకు చెన్నై, తమిళనాడు పుణ్య, పర్యాటక ప్రాంతాలకు నేరుగా కనెక్టివిటీ ఇస్తుంది. నాన్ ఏసీ స్లీపర్, జనరల్ కోచ్‌లతో 22 బోగీలు ఉంటాయి.
సత్యసాయి: లేపాక్షి మండలం 33/11 కేవీ కల్లూరు సబ్‌స్టేషన్ పరిధిలోని వ్యవసాయ బోర్లకు నేటి నుంచి విద్యుత్ వేళల్లో మార్పు అమలు చేయనున్నట్లు ఏఈ వెంకటేశులు తెలిపారు. తిమ్మిగానిపల్లి, వడ్డిపల్లి ఫీడర్లకు రాత్రి 12–3, ఉదయం 6–12 గంటలు, బైరాపురం, ఉప్పరపల్లి ఫీడర్లకు రాత్రి 3–6, మధ్యాహ్నం 12–18 గంటల వరకు త్రిఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు.
VSP: విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఆదివారం త్రీటౌన్ సీఐ పైడయ్య రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఆదివారం నిర్వహించారు. శాంతిభద్రతకు విఘాతం కలిగించే చర్యలు చేస్తే పీడీ యాక్ట్‌తో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో వ్యవహరించాలని సూచిస్తూ, రౌడీషీటర్లపై పోలీసుల నిత్యనిఘా ఉంటుందని తెలిపారు.
KDP: బద్వేల్ మండలం మడకల వారి పల్లెకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మద్దుల రఘురామిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకువెళ్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఆయన మరణించడంతో పలువురు జర్నలిస్టులు, అధికారులు ప్రాగడ సానుభూతి వ్యక్తపరిచారు.
E.G: రాజమండ్రి 14వ డివిజన్ ఆంధ్రనగర్, రెల్లి పేటలో MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు MLA, లా & ఆర్డర్ పోలీసులతో పర్యటించి ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అనుమానం ఉన్న ఆకతాయిలను అదుపులోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో శని, ఆదివారాల్లో నిర్వహించిన పశువుల సంతల ద్వారా రూ.3,17,170 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గొర్రెలు, మేకల సంతలో రూ.1,91,320 లక్షలు రాగా, పశువుల సంత ద్వారా రూ.1,25,850 లక్షలు సమకూరిందని కార్యదర్శులు రాఘవేంద్ర కుమార్, రూపుమార్ వెల్లడించారు. యార్డులో క్రయవిక్రయాలు భారీగా జరిగాయని పేర్కొన్నారు.
E.G: రాజమహేంద్ర వరం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకల్లో సోమవారం నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈరోజు నుంచి 26 వరకు దిల్లీ విమాన సర్వీసు 8 రోజుల పాటు రద్దు అయినట్లు ఇండిగో సంస్థ స్థానిక మేనేజరు జయంత్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి ప్రతిరోజూ సాయంత్రం 6.55 గంటలకు హైదరాబాద్‌కు మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం నిజరూప దర్శనంలో భక్తులకు కనువిందు చేశాడు. పురోహితులు రామకృష్ణ ఉదయాన్నే స్వామి మూల విరాట్‌కు పంచామృత, ఏకవార రుద్రాభిషేకం తదితర అభిషేకాలు చేపట్టి మంగళ నైవేద్యాలు అందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రకాశం: మార్కాపురంలో శ్రీమార్కండేశ్వర స్వామి దేవాలయంలో జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం అమావాస్య సందర్భంగా అమ్మవారిని అర్చకులు ప్రత్యేక పూలదండలతో ముస్తాబు చేశారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో ఉదయం నుంచి భక్తులు ఆలయానికి క్యూ కట్టారు.
ప్రకాశం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున మార్కాపురం, నంద్యాల జిల్లాల మధ్య, గిద్దలూరు మండలం దిగుమట నల్లమల అటవీ ప్రాంతంలో రైలు ఢీకొని ఒక ఎలుగుబంటి మృతి చెందింది. చలమ సమీపంలో జరిగిన ఈ ఘటనపై అటవీశాఖ, రైల్వే అధికారులు స్పందించి, ఎలుగుబంటికి పంచనామా నిర్వహించి, అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.
VZM: జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ఫిబ్రవరి 1నుండి 45 రోజులు ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. చేతి పంపులు, నీటి పథకాలను తనిఖీ చేసి చెడిపోయిన వాటిని 48 గంటల్లో మరమ్మతులు చేయాలన్నారు. నీటి కొరత గ్రామాల్లో బోర్లలోతు పెంచడం, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవాలన్నారు.
ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గొల్లపల్లి వద్ద పీఏబిఆర్ కుడికాలువను రైతులు, నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. కాలువలో నీటి వేగం, సామర్థ్యం తక్కువగా ఉండటంపై అధికారులను ఆరా తీశారు. నీటి సామర్థ్యం పెంచి రాప్తాడు, ధర్మవరం ప్రాంతాల్లోని అన్ని చెరువులకు నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
GNTR: పొన్నూరు మండలం కసుకర్రు మాజీ సర్పంచ్ మద్ది సీతమ్మ (83) ఆదివారం మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 90వ దశకంలో ఆమె సర్పంచిగా ఎన్నికై గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు. ఆమె మృతికి పలువురు నాయకులు, నేతలు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె అంత్యక్రియలు సోమవారం గ్రామంలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని జోనల్ కార్యాలయాలు, కలెక్టరేట్, సీపీ కార్యాలయంలో కూడా వినతులు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.