కృష్ణా: గ్రూప్-2లోని రోస్టర్ విధానం సవరించాలని అభ్యర్థులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రూప్-2 అభ్యర్థులను పట్టించుకోలేదన్నారు. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి అధికార పీఠమెక్కిన జగన్ కీలకమైన గ్రూప్-1, 2 ఉద్యోగాల నియామకాలను పక్కన పెట్టారన్నారు. ఈనెల 23న జరిగే పరీక్షకు 92,250 అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారని మండిపడ్డారు.
VZM: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి RRR రఘురామకృష్ణ రాజు ఆర్థిక నేరాలపై విచారణ చేపట్టాలిని విజయనగరం అంబేద్కర్ ఇండియా మిషన్ బుధవారం డిమాండ్ చేశారు. దళిత IPS పీవీ సునీల్ కుమార్ పై చేస్తున్న అసత్య ప్రచారాలను విజయనగరం జిల్లా దళిత సంఘాల సభ్యులు కెల్లా భీమారావు తదితరులు ఖండించారు.
ELR: ద్వారకాతిరుమల మండలం మారంపల్లి గ్రామంలో మండల ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ ఇంఛార్జ్ల సమావేశం మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.
NLR: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం ఫిబ్రవరి నెలకు సంబంధించిన హుండీ లెక్కింపు బుధవారం సాయంత్రానికి ముగిసిందని శ్రీ మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి తెలిపారు. హుండీ లెక్కించగా.. రూ.3,21,05,005 కరెన్సీ, రూ.8,10,100 చిల్లర నాణేలతో కలిపి మొత్తం రూ.3,29,15,105 వచ్చిందన్నారు. 58 గ్రాముల బంగారం, 1,280 గ్రాముల వెండి వచ్చినట్లు వెల్లడించారు.
NLR: వరికుంటపాడులో ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీవారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కోలాట నృత్యాన్ని ఆయన వీక్షించారు.
SKLM: ఆమదాలవలస పట్టణ హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు రెండవ రోజు జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమం బుధవారం జరిగింది. కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. శిక్షణలో నేర్చుకున్న మెలుకువలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందేలా బోధన చేయాలని వారికి సూచించారు.
కృష్ణా: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. బుధవారం పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యావంతులు బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు.
NDL: సంజామల ఎంపీడీవో కార్యాలయంలో బ్యాంకర్లతో బుధవారం ఎంపీడీవో సాల్మన్ సమావేశమయ్యారు. వివిధ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వాటిని ఇవాళ మొదటి విడత స్క్రూటినీ చేసినట్లు పేర్కొన్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలకు పిలుస్తామని, ఆ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎంపీడీవో సాల్మన్ వెల్లడించారు.
VZM: ప్రజలతో పోలీసులు స్నేహభావంతో మమేకం కావడమే పల్లెనిద్ర కార్యక్రమం ఉద్దేశ్యమని ఎస్సై ఎల్ దామోదర్ రావు అన్నారు. పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి చీపురుపల్లి మండలంలోని గొల్లలములగాం గ్రామంలో పోలీస్ సిబ్బందితో పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామ యువత సహకరించాలని కోరారు.
SKLM: అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా పాడేరులో ఉన్న మోదు కొండమ్మ తల్లిని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కు కున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
NLR: సున్నా పేదరికమే లక్ష్యంగా గ్రామాల్లో సచివాలయ సిబ్బందిచే పి4 సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఎంపీడిఓలను ఆదేశించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పి4 సర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిపిఓ వేణుగోపాల్, డిఎల్డిఓ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
SKLM: మందస మండలం లోహరిబంధ గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మధ్యాహ్న భోజనం అనంతరం సమీపంలో ఉన్న జీడీ తోటలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: NTR కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడకుండా పనులను వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇసుక సరఫరా, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అధికారులందరూ బాధ్యత వహించాలని అన్నారు.
KKD: గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పుష్కర – పోలవరం కాలువ గట్టుపై ఉన్న కోళ్ల ఫారంలో మరో 2500 కోళ్లు మంగళవారం మృత్యువాత పడ్డాయి. ఇప్పటివరకూ ఈ ఒక్కఫారంలోనే 6వేల కోళ్లు చనిపోయాయి. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా గోతులు తీసి ఖననం చేశారు. బర్డ్ ఫ్లూ అనుమానిత కోళ్లు ఖననం చేసిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ప్రజలు, వాహన రాకపోకలు నిషేధమంటూ ఫ్లెక్సీలు పెట్టారు.
KKD: మహాశివరాత్రి ఉత్సవాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామ క్షేత్రంలో బుధవారం ఈవో బల్ల నీలకంఠం అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.