AKP: మాకవరపాలెం మండలం జీ.కోడూరులోని క్వారీని రద్దు చేయాలని నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద దళిత రైతులు చేస్తున్న నిరసన సోమవారం నాటికి 48వ రోజుకు చేరింది. ఈ క్వారీ వల్ల తమ వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇన్ని రోజులుగా తాము నిరసన చేస్తున్న అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా క్వారీ అనుమతులు రద్దు చేయాలని కోరారు.
ATP: 10న అనంతపురంలో సూపర్ సిక్స్ విజయోత్సవ సభ జరుగనుంది. సీఎం, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొననుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎస్పీ జగదీశ్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, కర్నూల్, తిరుపతి రూట్లలో వెళ్లే వాహనాలు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంక్షలు పాటించి సహకరించాలన్నారు.
VSP: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి వియత్నాంతో ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై సోమవారం విశాఖలో ఏపీ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వియత్నాం టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఛైర్మన్ చౌ ట్రీ యంగ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, బౌద్ధ మతానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, బొజ్జన్నకొండ సందర్శించేందుకు వియత్నాం ఆసక్తి చూపిస్తున్నారు.
ASR: ఉచిత బస్సు పథకం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని దేవీపట్నం ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ.. ఈ పథకం వల్ల ఆటోలలో ఎవరు ప్రయాణం చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
కోనసీమ: శెట్టిబలిజ కులస్తులను ఓ.సి కేటగిరీలో కలుపుతున్నారని దానిని BC మంత్రి సుభాష్ పట్టించుకోవటం లేదని వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడడాన్ని కొత్తపేట BC నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం వారు మాట్లాడుతూ.. అనుభవము లేని పాలనతో గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి తీసుకుపోయారు. లేని ఆరోపణలతో మరింత దిగజారి మాట్లాడుతున్నారన్నారు.
అన్నమయ్య: సోమవారం రాయచోటి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో ప్రజాసమస్యల వేదిక అనంతరం, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి దాసరి నాగార్జున మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో 10-09-2025న శివ నర్సింగ్ కాలేజ్‌లో జరిగే ఈ మేళాలో ఆక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా ఎలక్ట్రానిక్స్, అపోలో ఫార్మసీ వంటి కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.
VZM: గజపతినగరం మండలంలో విపరీతంగా పెరిగిన బెల్టు షాపులను అధికారులు తక్షణమే నియంత్రించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎం.భాస్కరరావు అన్నారు. ఈమేరకు సోమవారం గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు. పేదలు మద్యం సేవించడంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అన్నమయ్య: రాయచోటి కలెక్టరేట్ PGRS హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో DRO మధుసూదన్ రావు, ఆర్డీవో శ్రీనివాస్, ఏడీ సర్వేయర్ భరత్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన అధికారులు, వివిధ సమస్యల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్దిష్ట కాలంలో వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ అధికారులకు తెలిపారు.
ATP: శింగనమల మండలం నాయనపల్లి క్రాస్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆగ్రో ఏజెన్సీస్‌ను సోమవారం కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలను పరిశీలించారు. యూరియా అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం స్థానిక రైతులకు యూరియా వినియోగంపై సూచనలు చేశారు.
GNTR: యూరియా సరఫరాలో అవకతవకలు, దళారుల ఆధిపత్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం పెదకాకాని తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐదు నుంచి పది ఎకరాలున్న రైతులకు ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వడం లేదని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి విమర్శించారు. తక్షణమే తగినంత యూరియాను సరఫరా చేయాలని కోరారు.
కడప: జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 11,628 ఎకరాల్లో రైతులు ఉల్లిపంట సాగు చేశారు. వీరపునాయునిపల్లె, మైదుకూరు, దువ్వూరు, వేముల, తొండూరు, వేంపల్లి, ముద్దనూరు మండలాల్లో ఎక్కువగా ఉల్లిపంటను సాగు చేశారు. ఈనెల 10కి 655 ఎకరాల్లో, 17కి 1,265, 24కి 3,674, అక్టోబర్ 1కి 3,206, అక్టోబర్ 7కి 2,828ఎకరాల్లో ఉల్లి పంట కోతకు వస్తుందని ఉద్యానశాఖ DD రవిచంద్ర తెలిపారు.
అన్నమయ్య: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో యూరియా నిల్వలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు రైతులకు అందుబాటులో ఉన్నాయని, తప్పుడు సమాచారం ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
NDL: నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోతే ఆందోళన చేపడతామని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు హెచ్చరించారు. సోమవారం మారుతి నగర్ కాలనీ ప్రజలతో పెయింటర్ హుస్సేన్సా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. నాగేశ్వరావు మాట్లాడుతూ.. మారుతి నగర్ కాలనీ ఏర్పడి 30సంవత్సరాలు అవుతున్న, కాలనీలో రోడ్లు ,మంచినీటి సమస్యలు ఎదురుకుంటున్నారు.
అన్నమయ్య: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాళ్ల శ్రీనివాసులు నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో స్థానిక మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
కోనసీమ: రావులపాలెం మండలం ఈతకోటలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో కొడమంచిలి శేఖర్, కొల్లి సత్యవతి గృహాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ అంశాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.