NLR: విడవలూరు మండలం అన్నరెడ్డిపాలెంకు చెందిన వైసీపీ బీసీ నాయకుడు ఉప్పాల శివకుమార్ శుక్రవారం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమె కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక నేతలతో కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కృష్ణా: గుడివాడ పట్టణంలోని అక్కినేని నాగేశ్వరావు కళాశాలలో ఈనెల 14వ తేదీన ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
NTR: ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారు చేసేందుకు కృషి చేయాలని, వచ్చే జూన్ నెల మొదటి వారంలో కొత్త రుణాలతో పెద్ద ఎత్తున యూనిట్లు నెలకొల్పుటకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నంలో జీవనోపాధుల కార్యాచరణ ప్రణాళికపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ప్రకాశం: పొదిలి పట్టణం విశ్వనాధపురంలోని జూనియర్ కాలేజ్ గేటు వద్ద కొండలా పేరుకుపోయిన చెత్తను జేసీబీ సాయంతో శుక్రవారం తొలగించారు. చెత్తను తొలగిస్తున్న పనులను కమిషనర్ కేఎల్ఎన్ నారాయణరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీ రావు దగ్గరుండి చెత్త తొలగింపు పనులను పరిశీలించారు. పరిసరాలను శుభ్రం చేయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రకాశం: కనిగిరి మండలం బాలవెంకటాపురం గ్రామంలో ఈ నెల 14వ తేదిన నూతనంగా నిర్మించిన పట్టాభి సీతారామ చంద్రస్వామి నూతన విగ్రహ, శిఖర, ధ్వజ ప్రతిష్టా కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవును కలిసి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
NLR: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో మే నెల 15వ తేదీన దాదాపుగా 339 అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నగర మేయర్ పోట్లూరి స్రవంతిని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మేయర్కు అందజేశారు.
VZM: జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దిమిలి అచ్యుతరావు తన దగ్గర ఉన్న వివిధ రకాల పుస్తకాలు అందరికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో తమను సంప్రదించిన మేరకు వారి ఇంటికి వెళ్లి పుస్తకాలను స్వీకరించామని జిల్లా గ్రంథాలయ సంఘం అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పుస్తక హుండీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు.
VZM: నవోదయం 2.0లో భాగంగా కొత్తవలస మండలంలో నాటుసారా కేసుల్లో ముద్దాయిలపై బైండోవర్ నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ నాయుడు గురువారం తెలిపారు. తమన్నమెరక, జోడిమెరక, అప్పన్నదొరపాలెం, చినమన్నిపాలెం, ముసిరాం గ్రామానికి చెందిన 23 మందిని మండల మెజిస్ట్రేట్ బి. నీలకంఠరావు ముందు ప్రవేశపెట్టి కేసులు నమోదు చేశామన్నారు.
సత్యసాయి: ధర్మవరం నియోజవర్గంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ రేపు పర్యటించనున్నారు. ఉదయం 6:30 గంటలకు మడుగుతేరు రథోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఎన్డీఏ కార్యాలయంలో ప్రజలతో సమావేశం అవుతారు. రాత్రి 7 గంటలకు అనంతపురం బయలుదేరి వెళ్తారని మంత్రి కార్యాలయ సిబ్బంది వెల్లడించారు.
ATP: కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయంలో విలేఖరుల సంఘం నేతలు శుక్రవారం అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి ఈశ్వరమ్మకు వినతి పత్రం అందజేశారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ పోలీసులు వ్యవహరిస్తున్నారని, సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై నోటీసులు లేకుండానే ఇంటిపై దాడి చేయడం దారుణమని తెలిపారు. కేవలం నిజాలను రాసినందుకే దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
సత్యసాయి: ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మురళీ నాయక్ మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. గోరంట్ల మండలం గడ్డం తాండ పంచాయతీ కల్లి తండా గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళీ నాయక్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. నిన్న రాత్రి పాకిస్థాన్- భారత్ మధ్య జరిగిన యుద్ధంలో మురళీ నాయక్ మృతి చెందినట్లు సమాచారం. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కోనసీమ: మండపేట మండలం కేశవరంలో ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను తక్షణమే నిర్మించాలని ఆ గ్రామానికి చెందిన జిల్లా ఆర్ టి ఏక్ట్ ఛైర్మెన్ వల్లూరి శ్రీ వాణీ డిమాండ్ చేశారు. ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ఆమె చేపట్టిన దీక్ష శుక్రవారంతో 22 వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా దీక్ష చేస్తుంటే పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
PLD: కార్యకర్తల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. దుర్గి మండలం ఓబులేసుని పల్లెకు చెందిన కొమ్ము అబ్రాహాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబానికి పార్టీ సభ్యత్వ భీమా కింద రూ.5 లక్షల చెక్కును శుక్రవారం అందజేశారు. కష్టకాలంలో పార్టీ భీమా ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
KDP: పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుణాలను పురస్కరించుకొని ఈ నెల 13న ఉదయం 8 గంటలకు ఎద్దుల బండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో గెలిచిన ఎద్దుల యజమానులకు మొదటి బహుమతిగా రూ.40 వేలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా వరుసగా తొమ్మిది బహుమతుల వరకు బహుమతులు ఉంటాయని నిర్వాహకులు చెప్పారు.
కోనసీమ: దేశ మహిళల సింధూరం దూరం చేసిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ ద్వారా తగిన సమాధానం భారత్ చెప్పిందని కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు కొన సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం అయన మాట్లాడుతూ.. కల్నల్ సోఫియా సురేషీ ముస్లిం మిలట్రీలో అత్యంత ప్రతిభా వంతురాలు అయిన ఆమె నేతృత్వంలో సిందుర్ విజయవంతం అవడంతో హర్షం వ్యక్తం చేశారు.