ATP: అనంతపురం నగర శివారులోని కందుకూరు వద్ద మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వెంకట రాముడు అనే వ్యక్తి మృతి చెందగా… మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రకాశం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే సహించేది లేదని మార్కాపురం పట్టణ టూ టౌన్ ఎస్సై రాజమోహన్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం పట్టణ శివారు ప్రాంతంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగుతున్న పలువురిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని వారికి హితవు పలికారు.
KRNL: ఆదోని పట్టణం వెంకన్నపేటలో పట్టపగలు మహిళను కత్తితో బెదరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుడిని ఆదోని రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన డీఎస్పీ హేమలత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అరెస్టు చేసి ముద్దాయిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
SKLM: రాగాల మూడు గంటల్లో శ్రీకాకుళం జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ రోణంకి కూర్మనాథ్ మంగళవారం తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేటప్పుడు పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.
ATP: బ్రహ్మసముద్రం మండలం వేపలపర్తి గ్రామంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ తీరుకు నిరసిస్తూ రైతులు బ్యాంకు ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం మండల అధ్యక్షుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు వ్యతిరేకంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ కొత్త నిబంధనలు పెడుతూ రైతులకు ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం శంకర్ విలాస్ బ్రిడ్జి పనుల పురోగతిపై మున్సిపల్, ఆర్ & బీ, రైల్వే అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొని పనుల గురించి అధికారులతో చర్చించారు.
PLD: సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
NLR: సోమశిల జలాశయ నీటి వివరాలను అధికారులు మంగళవారం వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద నీరు రావడం లేదని ఏఈ శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 52.358 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 500, ఉత్తర కాలువకు 50, దక్షిణ కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
NLR: చేజర్ల మండలం ఆదూరుపల్లి పూసల కాలనీలో నీటి మోటారు వారం రోజుల క్రితం చెడిపోయింది. అప్పటి నుంచి స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేరే ప్రాంతాల నుంచి ఆటోల ద్వారా నీరు తెచ్చుకుంటున్నారు. రోజువారీ అవసరాలకు నీరు తగినంత లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. అదికారులు వెంటనే స్పందించి మోటారు బాగు చేయాలని కోరుతున్నారు.
నెల్లూరులోని శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామ స్థూపం మైదానంలో పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. సోమిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో అర్చకులు సత్కరించారు.
కోనసీమ: ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామివారి అన్నదాన భవన నిర్మాణానికి మంగళవారం గాజువాక వాస్తవ్యులు నూక వెంకట గణేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళంగా అందించారు. వీరికి ఆలయ అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి చరిత్ర గురించి వివరించారు. డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రావు, సిబ్బంది స్వామివారి చిత్రపటం అందించారు.
VSP: నగరంలోని పెదవాల్తేరులో గల కరకచెట్టు పాలమాంబను సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి పండుగ సందర్భంగా సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయతో రాష్ట్ర, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు ఆయన తెలిపారు.
VSP: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, మండల, జిల్లా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తాత్కాలిక పదోన్నతుల సీనియార్టీ జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఓ కార్యాలయం నోటీస్ బోర్డ్‌లో కూడా ఈ లిస్ట్ ఉంటుందని, అభ్యంతరాలు ఉంటే ఈనెల 18లోపు తెలియపరచాలని ఆయన కోరారు.
ప్రకాశం: కొమరోలు మండలం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ఎంఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశానికి అంగన్వాడి కార్యకర్తలు కూడా హాజరుకావాలని కోరారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో బడిబాట కార్యక్రమం పై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.