W.G: ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి PGRS కాల్ సెంటర్ 1100 ఒక సమర్థవంతమైన వేదిక అని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 1100 సేవలకు సంబంధించిన సమాచార బ్రోచర్‌ను ఎస్పీ ఆవిష్కరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత జవాబుదారీతనంతో కూడిన వేగవంతమైన పోలీస్ సేవలను అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు.
ఏలూరు: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్ సోమవారం మాట్లాడుతూ.. అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఉంటే నం. 08812-230197కు ఫోన్ చేయాలని సూచించారు. ఆయా పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను క్లోజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
VZM: నెల్లిమర్లలోని శ్రీ రామస్వామి వారి దేవస్థానం రామతీర్థం ఆంజనేయస్వామి వారికి పంచామృత అభిషేకం, విశేష పుష్పార్చన, సింధూరార్చన, తమలపాకు అర్చన కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. అర్చకులు విశేష పూజలు జరిపించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ వైవీ.శ్రీనివాసరావు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 27 నుంచి జరగనున్న ప్రాక్టికల్స్, ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న పబ్లిక్ ఎగ్జామ్స్‌కు సంబంధించి ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల సందేహాలకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆర్ఐఓకు ఆదేశాలు జారీ చేశారు.
TPT: తిరుమలలో ఫిబ్రవరి ఒకటో తేదీ రామకృష్ణ తీర్థ ముక్కోటి జరుగుతుంది. తిరుమలలో గల పుణ్యతీర్థాలలో సప్త తీర్థములు ప్రముఖమైనవి. అందులో రామకృష్ణ తీర్థం ఒకటి. ప్రతి సంవత్సరం మాఘ మాసం పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఇక్కడ కొలువై ఉన్న శ్రీరాముడు, శ్రీకృష్ణ విగ్రహాలకు అర్చకులు అభిషేకం నిర్వహిస్తారు.
NDL: చాగలమర్రిలో ఓ మహిళ పోగొట్టుకున్న విలువైన హ్యాండ్ బ్యాగ్‌ను సోమవారం పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించి అప్పగించారు. బ్యాగ్లో రూ. 18,000 నగదు, మొబైల్ ఫోన్, రూ.1.50 లక్షల విలువైన ప్లాటినం కడియం ఉన్నాయి. సీసీ కెమెరాల సహాయంతో ఎస్సై రాజా రెడ్డి సిబ్బందితో కలిసి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు.
ATP: వేమన పద్య పోటీలలో ప్రతిభ చాటిన పోలీస్ రక్షక్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఎస్పీ జగదీష్ బహుమతులు అందజేశారు. వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఈ పోటీల విజేతలకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు. వేమన తత్వబోధలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అభినందించారు.
KRNL: గుర్తుతెలియని వ్యక్తులు పంపే APK ఫైల్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని DIG, SP విక్రాంత్ పాటిల్ సోమవారం హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఇన్‌స్టాల్ చేస్తే వాట్సాప్,ఫేస్‌బుక్‌తో పాటు బ్యాంకింగ్ యాప్‌లు హ్యాక్ అయ్యే ప్రమాదముందని తెలిపారు. ఫోన్ హ్యాక్ అనుమానం వస్తే వెంటనే ఫ్లైట్ మోడ్‌లో పెట్టి సైబర్ ల్యాబ్ పోలీసులను సంప్రదించాలని వెల్లడించారు.
VZM: గజపతినగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత ఆత్మాహుతి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష కుంకుమార్చన హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగరాజు కళామందిర్ థియేటర్ యజమాని నార్కెడిమిల్లి బంగార్రాజు (రాజా), రజిని దంపతులు 102 గోత్రాలతో గల వెండిబిల్లల మాలను అమ్మవారికి బహుకరించారు.
కృష్ణ: హత్యాయత్నం కేసులో వల్లభనేని వంశీ అనుచరులకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నూతక్కి సునీల్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీతో పాటు మొత్తం 8 మందిపై కేసు నమోదు కాగా, ఇప్పటికే వంశీని అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అనగాని రవి, తేలప్రోలు రాము, కొమ్మా కోట్లు సహా మరో ఆరుగురికి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
ASR: కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని సాకులపాలెం, నూకరాయితోట గ్రామాల్లో సోమవారం మంప ఎస్సై శ్రీనివాస్ పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం రహదారి నిబంధనలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
VSP: సంక్రాంతి పండగ నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్.శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆదివారం, సోమవారం విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 2 ట్రావెల్ బస్సులను సీజ్ చేసినట్లు వారు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన మరో 42 బస్సులపై కేసుల నమోదు చేసి రూ.7,22,000 జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా పాసర్లపూడికి చెందిన సానబోయిన సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ పసుపులేటి మహాలక్ష్మి రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సత్యనారాయణ తెలిపారు.
KKD: ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21న కాకినాడలో జరుగుతుందని సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సమావేశంలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశ పెడతారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థాయీ సంఘాల సమావేశాలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, సభ్యులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.