PLD: బొల్లాపల్లి మండలం బండ్లమోటు బొల్లాపల్లి గ్రామంలో సోమవారం పనుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరంలో గేదెలకు చూడి పరీక్షలు చేసి గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య అధికారి జి కవిత, కె. కోటేశ్వరరావు, ఖాసిం, రామరావు, తదితరులు పాల్గొన్నారు.
CTR: చౌడేపల్లి మండలం కాగతి ప్రాథమికోన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోకి వచ్చి ముగ్గు వేసి, నిమ్మకాయలు కోసి, అక్షింతలు వేసి తాంత్రిక పూజలు చేసి ఉండగా మంగళవారం ఉదయం గుర్తించారు. దీనిని చూసిన ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. గతంలో పలుమార్లు ఇలా జరిగిందని వారు తెలిపారు.
సత్యసాయి: ఓడీసీ మండలం కొండకమర్లలో వారం రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ హాజరయ్యారు. విజేతగా నిలిచిన జట్టుకు ఆయన తన వంతుగా రూ. 5 వేల నగదు బహుమతి అందజేశారు.
ప్రకాశం: కంభం చెరువుకట్టపై SI శివకృష్ణరెడ్డి సోమవారం సాయంత్రం యువతకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మక చెరువుకట్ట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. మద్యం సీసాలను పడవేయకూడదని చెప్పారు. యువత స్పోర్ట్స్ బైక్ వేగంగా నడుపుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని హెచ్చరించారు.
GNTR: పొన్నూరు సమీపంలోని నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం 30పడకలున్న ఆసుపత్రికి మరో రెండు అంతస్తులు నిర్మించనున్నారు. బెడ్లు సరిపోక రోగులను గుంటూరు, తెనాలికి పంపాల్సిన పరిస్థితి తొలగనుంది. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
ELR: పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-1, గ్యాప్-2 ప్రధాన డ్యాం పనుల్లో రోలింగ్ షీప్ ఫూట్ రోలర్లు వాడాలని విదేశీ నిపుణులు సోమవారం సూచించారు. సాధారణంగా షీప్ ఫూట్ రోలర్లను మట్టిని పటిష్ఠంగా నొక్కడానికి ఉపయోగిస్తారు. ఈ రోలర్ డ్రమ్ చుట్టూ గొర్రె కాళ్ల ఆకారంలో ఉండే ఇనుప మేకులు ఉంటాయి. ఇవి బంకమట్టి వంటి మెత్తటి నేలలను లోతుగా నొక్కి, గాలి బుడగలు లేకుండా చేస్తాయి.
ASR: ఏజెన్సీ ప్రాంతాల్లో అడ్డ పిక్కల సీజన్ మొదలైంది. అడవుల్లో సహజంగా విరివిగా లభించే ఈ పిక్కలను గిరిజనులు సేకరించి తమ ఆహారంగా వినియోగిస్తుంటారు. అడవుల్లో లభించే పచ్చి పిక్కలను కొందరు నేరుగా తినగా, మరికొందరు వంటల రూపంలో వాడుతుంటారు. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని గిరిజనులు చెబుతున్నారు. సంతల్లో కూడా వీటి విక్రయం భారీగా ఉంటోంది.
ప్రకాశం: సింగరాయకొండలో ప్రసిద్ధి గాంచిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహాస్వామి వారి దేవస్థానంలో ఇవాళ శ్రవణ నక్షత్రం సందర్భంగా ఉదయం 7 గంటలకి స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహిస్తున్నారు. అనంతరం తిరుప్పావడ సేవ జరుగుతుందని ఆలయ ఈవో కృష్ణవేణి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకావాలన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరారు.
కడప: బ్రహ్మంగారి మఠం మండలంలోని దిరసవంచ పంచాయతీ ఎస్సీ కాలనీలో మోటార్ రిపేర్ రావడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ రాళ్ల పాటి అమీర్ భాష, ఆర్డబ్ల్యూఎస్ఏఈ వెంకటేష్ నూతనంగా మోటార్ పైప్ లైన్లు ఏర్పాట్లు చేసి ప్రజలకు నీటి సమస్యను పరిష్కరించారు. నూతనంగా మోటార్ పైప్ లైన్లు ఏర్పాట్లు చేసినందుకు గ్రామస్తులు సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు.
W.G: భీమవరంలో తల్లి చేసిన తప్పు ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. భర్తపై అలిగిన లక్ష్మీ అనే మహిళ కూల్ డ్రింక్ ఎలుకల మందు కలుపుకుని కొంచెం తాగి నిద్రపోయింది. లక్ష్మీ కుమారుడు రుద్ర కాంత్ మిగిలిన కూల్ డ్రింక్ తాగేశాడు. అస్వస్థతకు గురైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందాడు. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం నింపింది.
KRNL: లంబాడీల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఆర్.కైలాష్ నాయక్ సోమవారం ఢిల్లీలో నేషనల్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతర్సింగ్ ఆర్యా, జాతీయ సభ్యుడు జాటోత్ హుసేన్ నాయక్లను కలిశారు. రాష్ట్రంలోని లంబాడీల ప్రస్తుత స్థితిగతులు, వారి హక్కుల పరిరక్షణపై వినతిపత్రం సమర్పించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
KDP: జనసేన పార్టీ నాయకుడు అతికారి వెంకటయ్య నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘వెంకటయ్య మృతి చెందారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రాజంపేట నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్వహించారు’ అని అన్నారు.
NDL: APSSDC ఆధ్వర్యంలో ఇవాళ డోన్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 13 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.
KRNL: జిల్లాలో FCI డివిజనల్ కార్యాలయం ఎక్కడికీ తరలిపోదని MP బస్తిపాటి నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం ఎఫీసీఐ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. కార్యాలయాన్ని అనంతపురానికి తరలించే ప్రతిపాదన లేదని అన్నారు. చెన్నైలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్యాలయం కర్నూలులోనే ఉండాలని కోరగా కమిటీ సానుకూలంగా తీర్మానించిందని వివరించారు.
తూ.గో జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. పండుగ 4 రోజుల్లో రూ. 17.20 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 25,755 బీరు కేసులు, 14,072 మద్యం కేసులు అమ్ముడయ్యాయన్నారు. జనవరి 1 – 13 వరకు 30,345 బీరు కేసులు అమ్ముడవగా.. పండగ 4 రోజుల్లోనే 25,755 కేసుల విక్రయాలు జరిగినట్లు వివరించారు.