RR: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ కృష్ణ(60) మృతి చెందారు. ఆరాంఘర్ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా, TG 5T 5229 నంబర్ గల ఇటుక లారీ వేగంగా వచ్చి కృష్ణను ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
TG: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దశంకరంపేట జాతీయ రహదారిపై ఓ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబసభ్యులు మృతిచెందారు. ప్రమాదంలో భార్యభర్తలతో పాటు కుమారుడు, కుమార్తె మరణించారు. మృతులను కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగీ గ్రామవాసులుగా గుర్తించారు.
AP: బంగారు కోసం వృద్ధురాలిని హతమార్చిన అమానవీయ ఘటన విజయనగరం జిల్లా ముడసర్లపేటలో జరిగింది. ముడసర్ల అప్పాయమ్మ(70) హత్య చేసి రెండు తులాల బంగారం దోచుకున్న దుండగులు.. ఆమె మృతదేహాన్ని గ్రామ శివార్లలో పడేశారు. కుటుంబసభ్యులు విజయవాడ వెళ్లడంతో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఈ దారుణం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: కృష్ణాజిల్లాలో కంకిపాడు-మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ బైక్ అక్కడికక్కడే దగ్ధమయ్యింది. పెట్రోల్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా బైక్‌లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన వాహనదారుడు వెంటనే బైక్‌పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.
BDK: చర్ల సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్, ఒడిసా సరిహద్దుల్లో గల సోనాబేడా సమీపంలో ఉన్న దేకున్ పానీ సీఆర్పీఎఫ్ శిబిరంలో శనివారం ఒక జవాన్ ఏకే 47 రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఒడిసా రాష్ట్రంలోని ఖర్దారా గ్రామానికి చెందిన గోపీనాథ్ సబర్‌గా అధికారులు గుర్తించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అయితే ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
AP: కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయిన కాసేపటికే మృతి చెందింది. ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది. గమనించిన స్కూల్ సిబ్బంది వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ విద్యార్థిని చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్‌లో డ్రగ్స్ తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్, లంగర్‌హౌస్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.70 లక్షల విలువైన 5 కిలోల హాష్‌ఆయిల్, 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు విజయనగరం వాసి వియజ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
KDP: తల్లి మందలించడంతో కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. స్థానిక 1-టౌన్ పోలీసుల సమాచారం మేరకు.. శ్రీరాం నగర్‌కు చెందిన వేదవతి (20)కి 4 నెలల క్రితం వివాహ నిశ్చితార్థం అయ్యింది. ఇంటి పనులు చేయాలని శుక్రవారం తల్లి భాగ్యలక్ష్మి, కుమార్తెను మందలించింది. దీంతో వేదవతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
AP: విజయనగరం తెర్లాం మండలం గొలుగువలసలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి వృద్ధురాలు సజీవదహనం అయింది. ఈ క్రమంలో మంటలు వ్యాపించి 10 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: గూడూరు మండల పరిధిలోని పురిటిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని మణి అనే స్కూటరిస్ట్ మృతి చెందారు. నెల్లూరు నుండి ఓడూరుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొనడంతో తలకు గాయాలయ్యాయి. ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KMR: భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో 44వ హైవేపై ఆగి ఉన్న టిప్పర్‌ను ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ శ్రావణ్ కుమార్ తలకు తీవ్ర గాయాలవడంతో అతన్ని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. బస్సు స్టాఫ్‌ను ఎక్కించుకోవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది.
AP: అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు యాత్రికులు మరణించడం విషాదకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎల్ఆర్ఎస్ డిపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో హాట్ మెటల్ కింద పడింది. దీంతో ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జపాన్ను భూకంపం మళ్లీ వణికించింది. అయోమోరి తీరంలో ఇవాళ ఉదయం 6.7 తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చాయి. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సముద్రం దరిదాపుల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఇటీవల (సోమవారం) ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. వరుస భూకంపాలతో జపాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు.
KDP: కడప పట్టణంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. స్వరాజ్ నగర్ వద్ద పల్లెప వెంకటయ్య (27)ను సిమెంటు రాయితో కొట్టి అతి కిరాతకంగా చంపారు. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు.