దక్షిణ సిరియాలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. డమాస్కస్ శివార్లలోని బీట్ జిన్ అనే గ్రామంలోకి ఇజ్రాయెల్ దళాలు ప్రవేశించాయి. దీంతో వారిని అడ్డుకోబోయిన గ్రామస్తులపై కాల్పులు జరిపాయి. ఈ దాటిలో 13 మంది పౌరులు మరణించినట్లు సిరియా వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపింది. అయితే, ఈ వార్తలను ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా ఖండించింది.
AP: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటేకల్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్ సుచిత్ర రాఘవేంద్రనగర్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. కార్ సర్వీస్ సెంటర్లో మంటలు చెలరేగాయి. షాపులో టైర్లు ఉండటంతో మంటలు భారీగా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
VSP: చోడవరం ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్ దాటుతుండగా, అనకాపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వైన్ షాప్‌లో పనిచేస్తున్న ఆలీ కాలు నుజ్జయి తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
VSP: పెద్ద వాల్తేరుకు చెందిన 11 ఏళ్ల పీ.చరణ్ తేజ హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. కాకినాడ జిల్లా కరప మండలంలోని బీసీ బాలుర హాస్టల్లో 6వ తరగతి చదువుతున్న అతన్ని ఈనెల 27న మధ్యాహ్నం హాస్టల్ వద్ద తల్లి దింపి వెళ్లింది. అయితే రాత్రి కనిపించకపోవడంతో హాస్టల్ ప్రిన్సిపల్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హాంకాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు 94 మంది మృతిచెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు తెలిపారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. మెష్, ప్లాస్టిక్ షీట్లు కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు చెప్తున్నారు.
TG: ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పెళ్లి చేసుకుందామని శ్రీకాంత్ అనే యువకుడు లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి ఆ యువతికి మరో యువకుడితో పెళ్లి అయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
AP: ప్రకాశం జిల్లా పెద్దరవీడు మద్దలకట్ట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. బస్సులో ఇరుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విన్‌జు యాప్‌పై ఈడీ కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో యాప్ ప్రమోటర్లు పవన్ సింగ్, సౌమ్య రాథోడ్లను అరెస్ట్ చేసింది. వారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది. గతవారం బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్‌లో సోదాలు చేసింది. విన్‌జు గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సుమారు రూ.505 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దీంతో ఇప్పటివరకు 56 మంది మరణించారు. 21 మంది గల్లంతయ్యారు. 600కి పైగా ఇళ్లు దెబ్బతిన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు.
అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతగా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉదయం 8:11 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్కుటథిల్పై రేప్ కేసు నమోదైంది. అతడిపై ఇప్పటికే సీఎం పినరయ్ విజయన్‌కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వివాహం పేరుతో తనపై రాహుల్ మామ్కుటథిల్ అత్యాచారం చేశారని.. బలవంతంగా గర్భస్రావం చేయించినట్లు బాధితురాలు ఆరోపించింది. దీంతో అతడిపై నెడుమంగడ్ వలియిమల పీఎస్‌లో నాన్-బెయిలబుల్ సిక్షన్ల కింద కేసు నమోదైంది.
TG: శంకర్‌పల్లిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. వికారాబాద్ నుంచి శంకర్ పల్లి వెళ్తున్న బస్సు అతివేగంతో వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు డ్రైవర్‌ను రక్షించారు. ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
TG: ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. 16 బృందాలతో అంతరాష్ట్ర ఆపరేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో దేవవ్యాప్తంగా ఉన్నభారీ నైజీరియన్ డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. రాష్ట్ర పోలీసులు ఇప్పటికే 50 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి భారీగా డ్రగ్స్ , డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అన్నమయ్య: మదనపల్లి నగరంలోని చంద్ర కాలనీలో కుటుంబ కలహాల కారణంగా రూబియా(25) అనే యువతి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.