ASR: అనంతగిరి మండలంలో సెల్ఫీల సరదా విషాదంగా మారింది. వాలసి పంచాయతీ మలుంగుమ్మి జలపాతంలో గురువారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువతులు మృతి చెందారు. బూర్జ పంచాయతీ జంబువలసకు చెందిన నలుగురు అమ్మాయిలు ఫొటోలు తీసుకునేందుకు జలపాతానికి వెళ్లారు. ముగ్గురు నీటిలోకి దిగగా, మరో యువతి సెల్ఫీ తీస్తుండగా జారి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
AP: కడప జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లె వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఓవర్ టేక్ చేయబోయి రెండు స్కూటీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతులు నాగిరెడ్డి(35), కుందా శేఖర్(45)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సమీపంలోని 63వ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమై డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
MBA చదివి గోల్డ్ మెడల్ సాధించిన వంశీకృష్ణ, జల్సాల కోసం గజదొంగగా మారాడు. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 62 చోరీలు చేశాడు. దొంగిలించిన సొమ్ముతో బౌన్సర్లను పెట్టుకుని తిరిగేవాడు. అదే సమయంలో పేద పిల్లలను చదివిస్తూ మానవత్వం చాటుకునేవాడని తెలుస్తోంది. చివరికి చౌటుప్పల్ పోలీసులు వాహనాల తనిఖీలో ఇతడిని అరెస్ట్ చేసి, నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.
సత్యసాయి: కదిరి మండలం పట్నం గ్రామంలో విషాదం నెలకొంది. పొలం వద్ద పంట కోసం ఉంచిన యూరియా కలిపిన నీరు తాగి 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరి క్రిష్ణ మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, గొర్రెలు దాహంతో బకెట్లలోని నీటిని తాగాయి. కొద్దిసేపటికే కడుపు ఉబ్బి అవి ప్రాణాలు విడిచాయి. సుమారు లక్షన్నర రూపాయల నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.
AP: పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో నిందితుడికి మాచర్ల కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. నిందితుడు నామాల శ్రీనును నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం మాచర్ల కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితుడికి న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో గురజాల సబ్ జైలుకు తరలించారు.
E.G: కడియం రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం అయింది. సుమారు 60 ఏళ్ల వ్యక్తి ప్లాట్ ఫామ్‌పై మృతి చెందినట్లు రాజమండ్రి రైల్వేస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. మృతుని ఎత్తు 5.5 అడుగులని ఇతర అధారాలు లభించలేదన్నారు. కాగా అతడి వివరాలు తెలిస్తే రాజమండ్రి జీఆర్పీ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
E.G: నల్లజర్ల(M) ప్రకాశరావుపాలెం శివారు వైఎస్సార్ యూనివర్సిటీ సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
TG: నల్గొండ జిల్లా తిప్పర్తి వద్ద పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. పట్టాలపై ఉన్న గేదెను రైలు బలంగా ఢీకొనడంతో, ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది. సిబ్బంది ప్రస్తుతం మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రమాదంతో నల్గొండ – మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
TG: హైదరాబాద్ నగరంలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. కుత్బుల్లాపూర్ బహదూర్‌పల్లిలోని డెకరేషన్ సామగ్రి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాం పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. కాలనీలో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
TG: హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక కెమికల్ సాల్వెంట్స్ గోదాంలో మంటలు చెలరేగడంతో, లోపల ఉన్న డ్రమ్ములు రహదారిపైకి ఎగిసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
E.G: ధవళేశ్వరం హత్య కేసులో మైనర్ నిందితుడికి రాజమండ్రి జువెనైల్ బోర్డు 28 నెలల కమ్యూనిటీ సర్వీస్‌తో పాటు రూ.1500 జరిమానా విధించింది. అక్బర్ ఖాన్‌పై కత్తితో దాడి చేయగా, ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడి వయస్సును పరిగణనలోకి తీసుకొని బోర్డు ఈ తీర్పు ఇచ్చింది. ఘటన సమయంలో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే వందకు పైగా ఎయిర్ స్ట్రయిక్స్ జరిగాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 254 మంది మరణించగా, వందలాది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 1982 తర్వాత లెబనాన్‌పై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు.
AP: నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం పరిసరాల్లోని నల్లమల అడవిలో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. రాత్రి మోకాళ్ళ తిప్ప, దయ్యాలతిప్ప ప్రాంతాల్లో మంటలు దిగువ నుండి ఎగువకు పాకాయి. వీటిని అదుపు చేయడం అటవీశాఖకు సాధ్యపడకపోవడంతో వన్యప్రాణులు ప్రాణభయంతో వణికిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా మంటలను ఆర్పి అడవిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
AP: తూ.గో జిల్లా నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం సంభవించగా.. భారీగా మంటలు వ్యాపించి ఔషధాల విభాగం పూర్తిగా దగ్ధమైంది. ఫర్నిచర్, ఇతర పరికరాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు.