ICC తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో జో రూట్(ENG) అగ్రస్థానంలో నిలిచాడు. విలియమ్సన్(NZ) రెండో స్థానంలో ఉండగా, స్టీవ్ స్మిత్(AUS) మూడో స్థానం దక్కించుకున్నాడు. ‘ఫాబ్-4’ (టెస్టుల్లో కోహ్లీ రిటైర్)గా పేరు పొందిన ఈ క్రికెటర్లు ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలవడం విశేషం. అయితే, టాప్-10లో భారత్ నుంచి జైస్వాల్(8వ) మాత్రమే స్థానం దక్కించుకున్నాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోడీకి బీసీసీఐ భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ప్రస్తుతం ‘A+’ కేటగిరీలో ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్లను ‘A’ కేటగిరీకి మార్చనున్నట్లు సమాచారం. ఈ జోడీ కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. దీంతో వారి వార్షిక వేతనం రూ.7 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు తగ్గనుంది.
అబుదాబి వేదికగా ఈనెల 16 నుంచి IPL వేలం ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్‌గా రూ.27 కోట్లతో రిషభ్ పంత్ ఉన్నాడు. ప్రస్తుతం జరగనున్న వేలంలో ఈ రికార్డు బద్దలవుతుందా..? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, ఇది మినీ వేలం కావడంతో, ఫ్రాంచైజీల వద్ద తక్కువ ‘పర్స్ వాల్యూ’ ఉండటం వల్ల ఈ రికార్డు బ్రేక్ కావడం కష్టమే అని చెప్పవచ్చు.
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు BCCI భారీ ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలో ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ‘A+’ కేటగిరీలో అతడికి చోటు కల్పించనున్నట్లు సమాచారం. దీంతో, ఏడాదికి రూ.7Cr వేతనం అందుకోనున్నాడు. ఈనెల 22న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్లేయర్ల కాంట్రాక్టులపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అతను ‘A’ కేటగిరీలో ఉన్నాడు.
సౌతాఫ్రికాతో నేడు జరిగే రెండో టీ20లో కూడా సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశ తప్పేలా లేదు. ఎలాంటి మార్పులు లేకుండా, గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా జితేశ్ శర్మకు మరోసారి అవకాశం ఇవ్వనున్నారు. అయితే.. గిల్, కెప్టెన్ సూర్య ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది.
TG: ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క ఉప్పల్ స్టేడియంలోనే సుమారు 2వేల మంది పోలీసులు బందోబస్తుగా ఉండనున్నారు. వీరికి అదనంగా స్టేడియం లోపల వెయ్యి మంది వాలంటీర్లు విధుల్లో ఉంటారు. 13వ తేదీ రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే మెస్సీ బస చేస్తారు.
తమిళనాడులో జరుగుతోన్న జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకం సాధించింది. మూడో స్థానం కోసం అర్జెంటీనాతో జరిగిన పోరులో భారత్ 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో భారత జట్టుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ టోర్నీ చరిత్రలో భారత్ మెన్స్ జట్టు కాంస్యం సాధించడం ఇదే తొలిసారి. 1997లో రజతం, 2001, 2016లో స్వర్ణం సాధించింది.
టీమిండియాలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజు శాంసన్, జితేశ్ శర్మల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కూడా శాంసన్‌ను కాదని జితేశ్‌కు అవకాశం ఇచ్చారు. మ్యాచ్ అనంతరం జితేశ్ మాట్లాడుతూ.. జట్టులో ఆరోగ్యకరమైన పోటీ ఉండటం మంచిదే అని చెప్పాడు. శాంసన్ తనకు పెద్దన్నలాంటి వాడని తెలిపాడు. కెరీర్ ప్రారంభంలో అతను తనకు చాలా సహాయం చేసినట్లు పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కోహ్లీ 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో టాప్ రన్ స్కోరర్‌గా(302*) నిలవడంతో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని.. రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగతున్నాడు. కాగా, 2021 తర్వాత కోహ్లీ వన్డేల్లో ఇప్పటివరకు అగ్రస్థానానికి చేరుకోలేదు.
పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ (CAP) కోచ్ వెంకట్రామన్‌పై ముగ్గురు అండర్-19 క్రికెటర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కోచ్ తలకు గాయం కావడంతో 20 కుట్లు పడ్డాయి. SMATకు ఎంపిక చేయకపోవడంతో క్రికెటర్లు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. స్థానికులకు కాకుండా ఫేక్ సర్టిఫికెట్లతో నాన్ లోకల్ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నట్లు CAPపై ఆరోపణలు వస్తున్నాయి.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కోహ్లీని 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు వాళ్లు ఫామ్‌లో లేకపోతే జట్టులో ఉండటం కష్టమని మరికొందరు అంటున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్, కోహ్లీ కంటే మెరుగైన బ్యాటర్లున్నారా?.. లేరు కాబట్టి వారిని జట్టులోంచి తప్పించాలని చూడొద్దు’ అని చెప్పుకొచ్చాడు.
అర్ష్‌దీప్ తొలి T20 పవర్ ప్లేలోనే 2 వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను పవర్ ప్లే(తొలి 6 ఓవర్లు)లో అత్యధికంగా 47 వికెట్లు పడగొట్టిన భారత ఆటగాడిగా భువనేశ్వర్ రికార్డును సమం చేశాడు. మరో వికెట్ తీస్తే ఈ రికార్డ్ అర్ష్‌దీప్ సొంతం కానుంది. ఇక ఈ లిస్టులో బుమ్రా(33) రెండో స్థానంలో ఉండగా.. అక్షర్, సుందర్(21) మూడో స్థానంలో ఉన్నారు.
విండీస్ స్టార్ ఆండ్రీ రస్సెల్ T20 క్రికెట్లో ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్లో 5000 రన్స్, 500 సిక్సర్‌తోపాటు 500 వికెట్లు పడగొట్టిన తొలి & ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు 577 మ్యాచులు ఆడిన రస్సెల్.. 9508 రన్స్, 774 సిక్సర్స్, 500 వికెట్లు పడగొట్టాడు. అలాగే T20ల్లో 500+ వికెట్లు తీసిన 6వ ఆటగాడిగానూ నిలిచాడు.
టీమిండియా పేసర్ బుమ్రా 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడంపై అర్ష్‌దీప్ హర్షం వ్యక్తం చేశాడు. బుమ్రా కూడా 100 వికెట్ల క్లబ్లో చేరడం గొప్పగా అనిపిస్తోందని చెప్పాడు. అతను వందో వికెట్ సాధించగానే దగ్గరికి వెళ్లి అభినందించినట్లు తెలిపాడు. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడం ఎల్లప్పుడూ సరదగా ఉంటుందని పేర్కొన్నాడు.
తొలి టీ20లో సాతాఫ్రికా బ్యాటర్లకు మన బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో సౌతాఫ్రికా కేవలం 50 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. డికాక్(0), మార్క్రమ్(14), స్టబ్స్(14), మిల్లర్(1), పెరారీయా(5) వికెట్లు పడ్డాయి. బౌలర్లలో అర్ష్‌దీప్ 2 వికెట్లు తీయగా, చక్రవర్తి, అక్షర్, పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. క్రీజులో బ్రెవిస్(21), యాన్సెన్(6) ఉన్నారు.