NZB: సహచర మహిళా ఉద్యోగిపై అసభ్యకరంగా ప్రవర్తించిన విద్యుత్ శాఖ ఉద్యోగిపై కేసు నమోదు చేశారు. NZB విద్యుత్ శాఖలోని డీఈఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కార్తీక్ పై ఐదవటౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదు చేశారు. డీఈఈ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు.
BHPL: జిల్లా కేంద్రంలోని భరత్ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి చెస్ పోటీలు ఇవాళ రసవత్తరంగా ముగిసాయి. నిన్న అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో విశ్వజిత్ సాయి 1వ స్థానం (రూ.10,000), అభిషేక్ 2వ స్థానం (రూ.5,000), మధుశ్రీ 3వ స్థానం (రూ.3,000) సాధించినట్లు చెస్ అసోసియేషన్ తెలిపింది.
WGL: నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లికి చెందిన గాదే హరి ప్రసాద్ (35) ఆదివారం సాయంత్రం ఒర్లాపూర్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన హరి ప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
MBNR: జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాల కోసం ఇచ్చే ఐదు నెలల ఉచిత శిక్షణ కరపత్రాలను కలెక్టర్ విజయేందిర బోయి ఆవిష్కరించారు. డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 30లోగా https://www.tsstudycircle.co.in దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
SRPT: మంత్రి ఉత్తమ్ రేపు హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గడ్డిపల్లిలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ పనులను పరిశీలించి, అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నాక, మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించనున్నారు.
MLG: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం డిప్యూటీ CM అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో MLG జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. రేషన్ కార్డ్ ఉన్న ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
NLG: తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన క్యాలెండర్ ను ఇవాళ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… చేనేత వృత్తి పరికరాల గురించి తెలియజేస్తూ క్యాలెండర్‌ను ముద్రించడం అభినందనీయమన్నారు. సంక్షేమ పథకాలు కార్మికులకు అందేలా సంఘం కృషి చేయాలని సూచించారు. జిల్లా కార్యదర్శి మురళీధర్ పాల్గొన్నారు.
WGL: CPI శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి BRS పార్టీపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని కోరుతూ, సోమవారం BRS పార్టీ ఆధ్వర్యంలో CP సన్‌ప్రీత్ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. BRS పార్టీ పై అనుచిత వాక్యాలు చేయడం సరికాదని అన్నారు.
ADB: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా చాటాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లాధ్యక్షుడు బ్రహ్మానంద్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో పార్టీ బలంగా ఉందని అందరూ సంసిద్ధంగా ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ శ్రేణులను కోరారు.
HNK: హన్మకొండ R&B అతిథి గృహంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సోమవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కీలక రోడ్లు, ప్రధాన రహదారుల విస్తరణ, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, అభివృద్ధి పనులపై సంక్షిప్తంగా చర్చించారు.
MDK: మహిళ సాధికారతకు ప్రభుత్వం చేయూతనందిస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు పేర్కొన్నారు. మెదక్ పట్టణంలో 346 మంది మహిళా సంఘాలకు రూ. 90,24,810 వడ్డీ చెక్కు అందజేశారు. మహిళ ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కుటుంబానికి మహిళలే వెన్నుముక అన్నారు. నాయకులు పాల్గొన్నారు.
KNR: వీణవంక మండలం చల్లూరు పరిధిలోని మానేరు వాగులో ఇసుక క్వారీకి అనుమతి పొంది, ఇప్పలపల్లి గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక తోడుతున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు ఆదేశించారు. కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారణ నిర్వహించి, జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.
JGL: జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 938 మహిళా సంఘాలకు వడ్డీ రహిత రుణాల చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌తో కలిసి సోమవారం పంపిణీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో రూ.2,98,40,444 విలువ గల చెక్కులను అందజేసి, సకాలంలో రుణాలు చెల్లించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, మహిళలు పాల్గొన్నారు.
BHPL: జిల్లా కేంద్రంలోని రామయ్యపల్లి గ్రామంలో ఇవాళ సాయంత్రం రూ.10 లక్షల వ్యాయామంతో నిర్మించనున్న లక్ష్మీ దేవర దేవాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, DCC జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
JGL: కథలాపూర్ మండలంలోని 19 గ్రామాల సర్పంచులు ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు హాజరయ్యారు. మల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులో గల న్యాక్ సెంటర్లో సర్పంచులకు ఐదు రోజులపాటు శిక్షణ తరగతులు ఉంటాయని అధికారులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు బాధ్యతలు, విధులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అధికారులు తెలియజేశారు.