MDCL: ఉప్పల్ NGRI ప్రాంతంలోని పలు వీధి లైట్లు గత కొన్ని రోజులుగా వెలగకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో చీకటి కారణంగా ప్రమాదాల భయం నెలకొంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
NRPT: నారాయణపేట పట్టణ శివారులోని బీమండి కాలనీలోని రామ్ సేన యువకుల అధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహించిన BSPL క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి ఆదివారం సాయంత్రం బహుమతులను అందజేశారు. మూడు రోజుల పాటు జరిగిన మ్యాచ్లలో బియంసి రాక్ స్టార్ జట్టు ప్రథమ బహుమతి గెలుపొందగా వారికి రూ.9,999, ద్వితీయ బహుమతి గెలుచుకున్న గేమ్ చేంజర్స్ జట్టుకు రూ.6,666 నగదుతో ట్రోఫీని వారు అందజేశారు.
గద్వాల పట్టణంలోని ఓ ఈవెంట్ హాల్లో ఆదివారం ఓ పాఠశాల 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 22 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు గురువులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పాఠశాల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
KNR: చొప్పదండి, ఆర్నకొండ సింగిల్ విండో కేంద్రాల్లో జీలుగు విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ అధికారి మమత తెలిపారు. రైతులు ఆధార్, పట్టాదారు పాసుబుక్ జిరాక్స్‌లతో వెళ్లి విత్తనాలు పొందవచ్చన్నారు. 30 కేజీల జీలుగ సంచి సుమారు మూడు ఎకరాల వరకు సరిపోతుందని, ఒక్క సంచి ధర రూ.2452.50గా ఉందని పేర్కొన్నారు.
MHBD: యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన కొండేటి కళాధర్‌ను నియమిస్తూ.. యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కళాధర్ మాట్లాడుతూ… నాకు జిల్లా పదవి రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
NRML: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ఆలస్యం చేయవద్దని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్‌లో వివిధ ఏజెన్సీల ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోళ్ల పురోగతిని సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడినన్ని లారీలను అందుబాటులో ఉంచాలని, హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం రవాణాను వేగవంతం చేయాలన్నారు.
WGL: కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయిలో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలను ప్రజావాణిలో అందజేయాలని కోరారు. ఇదే సమయంలో గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించబడనని కలెక్టర్ తెలిపారు.
SRPT: పంట అవశేషాల దహనంపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. మే నెలాఖరులోగా వంద శాతం కొనుగోళ్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
NZB: పేద విద్యార్థుల చదువుకు తమ ట్రస్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం నిజామాబాద్‌లోని లక్ష్మీ కళ్యాణ మండపంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మరింత రాణించాలని ఆకాంక్షించారు.
NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా ఈనెల 25 నుంచి 30 వరకు మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఆదివారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
MBNR: బాలానగర్ మండలంలో సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. బాలానగర్, పెద్దరేవల్లి, మోతీ ఘనపూర్, ఉడిత్యాల, హేమాజీపూర్ సబ్జెస్టేషన్ పరిధిలోని గ్రామాలు, పరిశ్రమలకు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకుని పశువులకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పీఎస్ పరిధిలోని సాదత్ నగర్‌లో దారుణం జరిగింది. బ్రదర్స్ డే రోజే సొంత తమ్ముడిని అన్నే హతమార్చాడు. రోటీ మేకర్స్ పనిచేసే మహ్మద్ ఫారూఖ్, తన తమ్ముడు మహ్మద్ సమీర్ (25)పై తీవ్రంగా దాడి చేయడంతో సమీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరికీ పెళ్లి కాలేదు. గొడవకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
PDPL: మంథని మండలం గుంజపడగు గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్‌కు రూ.15 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ కల్పించినట్లు సర్పంచ్ దండవేన సంధ్య తెలిపారు. ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి శ్రీజారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. రూ.15 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ పొందిన వారిలో అయిలి రవి, చెవుల శ్రీనివాస్, కంటే గణేశ్, తదితరులు ఉన్నారు.
NRML: సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లపెల్లికి చెందిన ముచ్చిండ్ల భీమయి (60) మృతి చెందింది. ఆటోలో అడెల్లి దేవాలయానికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో DCM భీమయి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
HYD: నార్సింగి పీఎస్ పరిధిలోని మూవీ టవర్స్ నివాస సముదాయంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. సీ- బ్లాక్ సెల్లార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.