MBNR: పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పాలమూరు యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగులు వీసీ ఆచార్య శ్రీనివాస్‌కి గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న కార్యవర్గంలో అంతర్గత కలహాల వల్ల బోధన, ఇతర సిబ్బంది పూర్తిస్థాయిలో నష్టపోతున్నారని పేర్కొన్నారు.
NZB: పాల్వంచ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్, ఆపరేషన్ కగర్‌లో భాగంగా ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న సమయంలో ల్యాండ్‌మైన్ పేలడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ దురదృష్టకర సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వడ్ల శ్రీధర్ మృతి పట్ల స్థానికులు, సహచరులు తీవ్ర శోకాన్ని వ్యక్తం చేశారు.
NZB: 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లను భారీగా పెంచడానికి అందరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో DIEO అధ్యక్షతన సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. రానున్న సప్లమెంటరీ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలన్నారు.
NZB: ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ మద్దతుగా ఈనెల 9న భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వరకు సాగనున్న ఈ ర్యాలీకి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవిత తెలిపారు.
NRML: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
HYD: సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ అన్నారు. గురువారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యేని కలిశారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. తప్పకుండా అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్నా.. కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తేవాలని అన్నారు.
NRML: జిల్లాకు చెందిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ‘ప్రేమతో నాన్న’ లఘు చిత్రానికి ఉత్తమ దర్శకునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాదులో వారికి ప్రశంసా పత్రం, అవార్డును టాలీవుడ్ దర్శకుల అసోసియేషన్ సభ్యులు మోహన్, వీ.సముద్రలు అందజేశారు. ఉత్తమ దర్శకుడిగా జిల్లా వాసి ఎన్నికవ్వడంపట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
HYD: హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఇంటర్ పాసైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సురేశాబాబు గురువారం తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 840 సీట్లు ఉన్నాయని, దోస్త్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NZB: MLA ప్రశాంత్ రెడ్డి దమ్ముంటే చర్చకు రా మేము సిద్ధంగా ఉన్నామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. గురువారం వారు మాట్లాడుతూ.. ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, CMపై చేసిన ఆరోపణలు ఆయన అహంకారానికి, రాజకీయ అవివేకానికి నిదర్శనమని అన్నారు.
KMR: తాడ్వాయి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా మురళి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎస్సైగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో దోమకొండ ఎస్సైగా, కామారెడ్డి కోర్టు లైజర్ అధికారి బృందంలో పనిచేసినట్లు తెలిపారు. తాడ్వాయి ఎస్సైగా పనిచేసిన రాజయ్య కామారెడ్డి కోర్టు లైజర్ ఆఫీసర్‌గా నియమితులైనారు.
మేడ్చల్: జిల్లాలో 995 ప్రైవేటు ఆస్పత్రులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,835 ఆస్పత్రులు ఉంటే కేవలం 2,840కి మాత్రమే అనుమతులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ ఉమాగౌరి మాట్లాడారు. అనుమతి లేని ఆస్పత్రులపై ఫిర్యాదు చేస్తే తనిఖీ చేసి, చర్యలు తీసుకుంటామన్నారు.
SRD: R&B, పంచాయతీరాజ్ సంగారెడ్డి మున్సిపల్ అధికారులతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథిగృహంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఐబీ నుంచి విగ్రహం వరకు 2.6 కిలోమీటర్లకు రోడ్డు వెడల్పుకు రూ.12 కోట్ల నిధులు మంజూరు అయినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ పాల్గొన్నారు.
SRD: ఝరాసంగం మండలంలోని కమల్ పల్లి హనుమాన్ మందిర్ ఆలయంలో ధ్వజస్తంభం, శివలింగం, నందీశ్వర, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉదయం 10: 30 గంటలకు ప్రత్యేక పూజలు నడుమ, వేదపండితుల మధ్య దంపతులచే యజ్ఞం, పూర్ణాహుతి, మహాకుంభసంప్రోక్షణ, మహా దీక్షా శీర్వచనములు చేశారు.
SRPT: IKP కేంద్రాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లు నాగార్జున రెడ్డి, దండ వెంకట్ రెడ్డిలు మాట్లాడారు.
ADB: ఈనెల 9, 10 తేదీల్లో రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పోటీల్లో జిల్లా నుంచి 20 టీమ్లు పాల్గొంటాయని చెప్పారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.20వేలు, ద్వితీయ బహుమతి రూ.10వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.