NRML: పల్లె దవకానాలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. గురువారం మధ్యాహ్నం జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె దవఖాననూతన భవనాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తుందన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
BHPL: జిల్లాలోని గోరి కొత్తపల్లి మండల బీజేపీ అధ్యక్షుడిగా సూదనబోయిన విష్ణు యాదవ్‌ను జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి నియమించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విష్ణు యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మండల బాధ్యతలు అప్పగించిన జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
MNCL: వేమనపల్లి మండల కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో 2025-26 సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరం MLT E/M కోర్స్ సాంక్షన్ అవడం జరిగిందని కళాశాల యాజమాన్యం గురువారం ప్రకటనలో తెలిపారు. కేవలం 40 సీట్లు మాత్రమే కలవని, అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
ASF: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను MLC దండే విఠల్‌తో కలిసి సన్మానించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
WGL: నిన్న ప్రత్యేక సెలవు (ఎండాకాలం నేపథ్యంలో ప్రతీ బుధవారం సెలవు) అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభం అయింది. అయితే మొన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి రూ.7,520 ధర పలకగా.. ఈరోజు రూ.7,440కి పడిపోయింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
MDK: నిజాంపేట మండలం నగరం తండా కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొససాగుతున్నాయి. గురువారం సీఈఓ నరసింహులు మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇన్‌ఛార్జ్ అరుణ్, సెంటర్ ఇన్‌ఛార్జ్ సుభాష్, రైతులు శంకర్, సురేశ్ ఉన్నారు.
HYD: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీకి అధికారికంగా తెర లేచింది. ఈ పోటీలో మొత్తం 109 దేశాలు పాల్గొంటున్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే రకరకాల కారణాలతో పలు దేశాలు తమ ప్రతినిధులను పంపలేకపోయాయి. దాంతో తొలి అంచనాలతో పోలిస్తే 30 దేశాలు తగ్గినట్లయ్యింది. ఇది గత మిస్ వరల్డ్ 2023 పోటీలో పాల్గొన్న 112 దేశాల కంటే తక్కువే అన్నారు.
HYD: పాతబస్తీలోని బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలోని సర్వే నెంబర్ 303, 306లలో ఉన్న 2500 గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు జేసీబీల సహాయంతో నేలమట్టం చేశారు. సమాచారం అందుకున్న కబ్జాదారులు, స్థానిక రాజకీయ నాయకులు హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.
BHPL: భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని మైనారిటీ గురుకులంలో ఖాళీ సీట్ల కోసం గురువారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవి తెలిపారు. నాన్ మైనారిటీ విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తు చేసినవారు ఈ డ్రా కు అర్హులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గురుకులంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో డ్రా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
KMR: దోమకొండ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇతర టెక్నాలజీ పై అవగాహన కల్పిస్తున్నట్లు కోటా ట్రస్ట్ మేనేజర్ బాబ్జి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాజిక్ బస్ అనే సంస్థ కంప్యూటర్ శిక్షణను ఉచితంగా నేర్పుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9493143378 నంబరు సంపాదించాలని అన్నారు.
BHNG: తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈనెల 12న నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి రావాలని యాదగిరిగుట్ట ఏసీపీ పాలేపల్లి రమేష్‌కు గ్రామస్థులు గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ పూజారి రమాకాంత్ శర్మ, గ్రామస్థులు పాల్గొన్నారు.
KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 4 మండలాలు, జుక్కల్ నియోజకవర్గంలోని 5 మండలాలకు భారతీయ జనతా పార్టీ మండలాల నూతన అధ్యక్షులను, జిల్లా కౌన్సిల్ సభ్యులను నియమించారు. ఈ నియామనంతో జిల్లాలోని అన్ని మండలాలకు అధ్యక్షుల నియామకం పూర్తయినట్లు జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు బుధవారం చెప్పారు. నూతన అధ్యక్షుల నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.
KMR: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధి సుదర్శన్ మాట్లాడుతూ.. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన అమాయకపు పర్యాటకుల ఆత్మ శాంతి కలగాలని కోరుతూ.. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు.
KMR: జిల్లా పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతుంది. జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పి. కృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఓవ్యక్తి పాస్‌ఫోర్ట్ దరఖాస్తు విచారణలో కృష్ణ సరైన శ్రద్ధ చూపలేదు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ విషయాన్ని గుర్తించి, నివేదికను ఇంఛార్జ్ డీఐజీకి పంపించారు. డీఐజీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
KMR: జిల్లాలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు కొనసాగుతున్నాయి. యువ భారత ఛాంపియన్ల తయారీ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాల్లో బుధవారం వాలీబాల్, ఫుట్‌బాల్ ఆటలకు సంబంధించిన క్రీడా సామగ్రిని జిల్లా కలెక్టర్ క్యాంప్ నిర్వాహకులకు అందజేశారు.