GDWL: జిల్లాలో జనాభా గణనను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. 2026లో ఇండ్ల గణన, 2027లో జనాభా గణన పూర్తి డిజిటల్ విధానంలో జరుగుతాయని ఆయన తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10, 2026 వరకు ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
SRCL: రచయితలు, కవులు సమాజం కంటే ముందుండి తమ రచనల ద్వారా దిశా నిర్దేశం చేయాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రస్తుతం రచయితలకంటే సమాజం ముందుకు వెళ్తుందని అందులోని ఘర్షణలను రచయితలు అందుకోవాలన్నారు. నిరంతరం అధ్యయనం చేయాలన్నారు.
HYD: ఉజకిస్తాన్ సాయుధ దళాల కోసం మూడు రోజుల డిఫెన్స్ మేనేజ్‌మెంట్ క్యాప్సూల్ ట్రైనింగ్ సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు విజయవంతంగా నిర్వహించారు. ఇండియా, ఉజకిస్తాన్ వార్షిక రక్షణ సహకార ప్రణాళిక 2025-26 కింద ఈ కార్యక్రమం జరిగింది. ఆధునిక రక్షణ నిర్వహణ అంశాలపై శిక్షణ ఇచ్చారు.
BHPL: ఉగాది పర్వదినను పురస్కరించుకుని HYD పట్టణ కేంద్రంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను గురువారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను శాలువతో సత్కరించి.. ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
SRD: ఖేడ్ మండలం మద్వార్ తండా గ్రామపంచాయతీలో కొత్తగా సీసీ రోడ్డు పనులకు సర్పంచ్ సర్దార్, గ్రామస్తులు గురువారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి కృషితో గ్రామానికి MGNREGS పథకం కింద రూ. 5 లక్షల నిధులు మంజూరయ్యాయని సర్పంచ్ తెలిపారు. దేవసోత్ కిషన్ నాయక్ ఇంటి నుంచి లాల్ సింగ్ ఇంటి వరకు సీసీ రోడ్డు వేస్తున్నట్లు చెప్పారు. ఇందులో వార్డు సభ్యులు ఉన్నారు.
ADB: బేలా మండలం గూడ గ్రామంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు శుభ ముహూర్తాన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వ్యవసాయ పనులను ప్రారంభించారు. రైతులు ఉదయాన్నే తమ బసవన్నలను అందంగా అలంకరించి అరక కట్టి పొలానికి వెళ్లి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. దీంతో గ్రామాల్లో ఉగాది పండుగ సందడి కనిపించింది.
SDPT: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఉగాది పండుగ ప్రతీక అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అనునిత్యం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
SRPT: జాజిరెడ్డిగూడెం(మం) అర్వపల్లిలోని శ్రీ యోగనంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా ఎమ్మెల్యే సామేలు ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఐశ్వర్యసంపదలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానన్నారు.
MDCL: ఉప్పల్లో ఉగాది పండుగ సందర్భంగా కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేక నిర్ణయం తీసుకున్నాయి. సంప్రదాయాలను గౌరవిస్తూ ఉగాది రోజున నాన్ వెజ్ వంటకాల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. కస్టమర్లకు పచ్చడి, పులిహోర, బొబ్బట్లు వంటి ప్రత్యేక శాకాహార వంటకాలు అందిస్తున్నారు. పండుగ వాతావరణానికి అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో గురువారం 5 కీలక రహదారుల విస్తరణకు రూ. 594 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో వైరా-జగ్గయ్యపేట, మధిర-తూటికుంట్ల, మధిర-ఎర్రుపాలెం, ఖమ్మం-బోనకల్ మార్గాలు 4 లైన్లుగా అభివృద్ధి కానున్నాయి. గ్రామాలు-పట్టణాల మధ్య కనెక్టివిటీ మెరుగై రవాణా సౌకర్యాలు పెరగడంతో రైతులు, వ్యాపారులకు ప్రయోజనం కలుగనుంది.
JN: స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం రూపొందించిన బ్రోచర్‌ను వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య, MLA కడియం శ్రీహరిలు గురువారం తమ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలోనే చేరి తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
NLG: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ.60, వాణిజ్య సిలిండర్ ధరను రూ. 116 పెంచడంపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్యాలలో ఇవాళ జరిగిన సంఘం మండల కమిటీ సమావేశంలో కత్తుల లింగస్వామి, మెట్టు పరమేష్, కుమారస్వామితో కలిసి ఆయన మాట్లాడుతూ.. పెరిగిన ధరలు పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారంగా మారాయన్నారు.
RR: శంకర్‌పల్లి మున్సిపాల్టీ 5వ వార్డు కౌన్సెలర్ బానూరి కృష్ణ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి పెన్షన్ రాని 20 మంది అర్హులకు ఉగాది పర్వదినాన తన సొంత నిధులతో పెన్షన్ అందజేశారు. ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసే వరకు ఈ సాయం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సెలర్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
WGL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని కాశిబుగ్గలో గురువారం BRS ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్పొరేటర్ మంతెన అమరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ MLA నన్నపునేని నరేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ MLA పూజలు నిర్వహించి, అనంతరం స్థానికులకు ఉగాది పచ్చడి, భక్షాలను పంపిణీ చేశారు.
NZB: నగరంలోని గాయత్రి నగర్, లక్ష్మీప్రియానగర్, ముబారక్ నగర్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని చెప్పుకొచ్చారు. వర్షం పడితే రోడ్లన్ని చిత్తడిగా మారి ప్రయాణానికి కష్టతరమవుతుందన్నారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు.