KMM: అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించకుండా, అనర్హులకు కేటాయిస్తున్నారని, వైరా మున్సిపాలిటీ పరిధిలో రెండవ వార్డుకు చెందిన నిరుపేద మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం నందు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలని ఆవేదన వ్యక్తం చేశారు.
NRML: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీవీటీజీలు కోలాం, తోటిలు, చెంచులు, కొండరెడ్లు ఐటీడీఎ సీసీడీపీ ద్వారా నిర్మించుకున్న ఇండ్ల నిర్మాణ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరగా విడుదల చేయాలని ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. శనివారం హైదరాబాదులో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియను కలిసి వినతి పత్రం సమర్పించారు.
MHBD: BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ నందీనగర్‌లో గల కేసీఆర్ నివాసంలో ఆయనను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇటీవల వైద్యపరీక్షల నిమిత్తం ఆయన యశోద ఆసుపత్రికి వెళ్ళిన విషయం తెలిసిందే.
ADB: ఆదిలాబాద్ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ కోరారు. శనివారం హైదరాబాదులో రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకాటి శ్రీహరిని ఆమె మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఆదిలాబాద్‌లో ఎక్కువగా గిరిజనులు ఉన్నారని వారి అభివృద్ధి కోసం పాడి పరిశ్రమకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆమె కోరారు.
NRML: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకుంటే విజయం సాధిస్తారని ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు అడ్వాల శంకర్ అన్నారు. మస్కాపూర్ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ విద్యార్థులను శాలువా కప్పి సన్మానించి అభినందించారు.
ADB: ఆదిలాబాద్ రిమ్స్‌కు వచ్చే ఆదివాసులకు మంచి వైద్య సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ కోరారు. శనివారం ఆయన రిమ్స్ డైరెక్టర్‌ను కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఏజెన్సీ ప్రాంతం నుండి వివిధ వ్యాధులతో ఆదివాసి గిరిజనులు రిమ్స్‌కు వస్తారని తెలిపారు.
MBNR: భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్రరావును ఎంపీ డీకే అరుణ శనివారం ఘనంగా సత్కరించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రామచంద్రారావు సారథ్యంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తామని ఎంపీ వెల్లడించారు.
MBNR: తమ పార్టీలో చంద్రబాబు నాయుడు కోవర్టులు ఉన్నారని తాను చేసిన వ్యాఖ్యలు కేవలం కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాత్రమే అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేనేం మాట్లాడానో నేను మాట్లాడిన వీడియో చూసి మాట్లాడాలని తెలిపారు. అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు.
KMM: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ అన్నారు. సత్తుపల్లి ద్వారకపూరి కాలనీ రోడ్డులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. అనారోగ్యంతో బాధపడే వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తారన్నారు.
KMM: మధిర మండల పరిధిలోని దేశాన్ని పాలెం గ్రామంలో గల శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయంలోని హుండీని శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది. దీంతో శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన దేవాలయ నిర్వాహకులు విషయం తెలుసుకొని మధిర పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు.
MBNR: జడ్చర్ల పట్టణంలోని 7వ వార్డు బూరెడ్డిపల్లిలో మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ రూ.4 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులను శనివారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోనేటి పుష్పలత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఉమాదేవి, మల్లె బోయినపల్లి సింగిల్ విండో ఛైర్మన్ పడాల మల్లేశ్, వార్డు అధ్యక్షుడు కరుణాకర్, వెంకటేశ్ కాలనీవాసులు పాల్గొన్నారు.
BHPL: టేకుమట్ల మండలానికి మంజూరైన 245 కుట్టుమిషన్లు ఎన్నికల కోడ్ కారణంగా ఏడాదిన్నరగా పంపిణీ కాకుండా నిలిచిపోయాయి. అప్పటి BRS ప్రభుత్వ హయాంలో వీటిని మంజూరు చేశారు. కొంత పంపిణీ జరిగినా, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ మిషన్‌లు తుప్పు పట్టే స్థితిలో ఉన్నాయని, వెంటనే పంపిణీ చేయాలని శనివారం లబ్ధిదారులు కోరుతున్నారు.
KMM: ఖమ్మంలో మున్సిపల్ శాఖ అధికారులు కుక్కలను పట్టుకుని దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 19వ డివిజన్‌లో వీధికుక్కల బెడదకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు, ప్రజల నుంచి వినతులు రావటంతో స్పందించిన కాంగ్రెస్ కార్పొరేటర్ చామకూరి వెంకటనారాయణ, మున్సిపల్ అధికారులను పిలిపించి కుక్కలను ఇక్కడి నుంచి తరలించాలని సూచించారు.
HNK: పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శాయంపేట మండలంలోని 23 మంది లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, నేతలు ఉన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా చేపట్టనున్న విశాలమైన రహదారుల నిర్మాణానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ శనివారం ప్రకటనలో కోరారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అన్నారు. ఇరుకు రోడ్లు విశాలంగా అభివృద్ధి చెందితే రవాణా కష్టాలు తొలగిపోతాయన్నారు. శంకుస్థాపన జరిగిన రోడ్లు త్వరగా పూర్తి చేస్తామన్నారు.