MNCL: శ్రీరాంపూర్ కాలనీలో అయ్యప్ప స్వాములు ఆదివారం నగర సంకీర్తన నిర్వహించారు. స్థానిక భక్తాంజనేయ దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ నగర సంకీర్తన పురవీధుల గుండా సాగగా అయ్యప్ప స్వాములు అయ్యప్ప, గణపతి, కుమారస్వామిల చిత్రపటాలతో పాల్గొన్నారు. అయ్యప్ప నామస్మరణ కీర్తనలు, భక్తి గీతాలతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
SRD: కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాపూర్ మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం తెలిపారు. కాంగ్రెస్ బలపరిచిన అనిల్ కుమార్‌కు కాకుండా, వేరే అభ్యర్థికి సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు తెలిపినందుకు భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
NTPT: మరికల్ మండలం అప్పంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. గ్రామానికి సర్పంచ్‌గా కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుతో మాలే కళ్యాణి బరిలో నిలవగా, ఆమె మామ మాలే దామోదర్ రెడ్డి 9 వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. మామ-కోడళ్లు ఒకేసారి ఎన్నికల బరిలో ఉండటంతో గ్రామ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 14 న ఫలితం వెల్లడి కానుంది.
RR: షాద్‌నగర్ నియోజకవర్గం చించోడు, దేవునిపల్లి, చౌలపల్లి, మొగిలిగిద్ద, తదితర గ్రామాల్లో సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలతో మాట్లాడుతూ.. ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు.
NRML: ఖానాపూర్ పట్టణంలోని రామ్ నగర్లో ఉన్న ముత్యాల పోచమ్మ ఊళ్ళ పోచమ్మ అమ్మవారికి గంగపుత్ర సంఘం నాయకులు మకర తోరణం సమర్పించారు. ఆదివారం దేవాలయంలోని అమ్మవారికి సంఘం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సంఘం తరఫున మకర తోరణం సమర్పించి పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
NZB: పదేళ్ల BRS ప్రభుత్వ పాలనలో స్వర్ణయుగంగా విరాజిల్లిన ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ సర్కార్ అధోగతిపాలైందని ఆర్మూర్ మాజీ MLA ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 సార్లు MLAగా పనిచేసిన తాను ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆదివారం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
NLG: చిట్యాలలో జాతీయ రహదారిపై జరుగుతున్న ఫ్లెఓవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలని కోరుతూ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. నల్గొండ పర్యటనకు వచ్చిన మంత్రిని చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం కలిసి విన్నవించారు. పనులు నెమ్మదించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
SRPT: మఠంపల్లి మండలంలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ పెదవీడులో స్క్రూటినీ పూర్తయ్యాక సర్పంచ్ అభ్యర్థుల జాబితాను RO విడుదల చేశారు. మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే స్థానికంగా ప్రధాన పోటీ BRS బలపరిచిన అభ్యర్థి మాతంగి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమరరపు వెంకటేశ్వర్లు మధ్యే ఉండనున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
MHBD: మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన గౌడ సంఘం అధ్యక్షుడు పోగుల సత్యం (60) ఆదివారం ఈత చెట్టు పై నుంచి జారిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యం రోజు మాదిరిగానే కల్లు గీత కోసం చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి జారిపడి తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పేర్కొన్నారు.
KMM: ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్న సీపీఎం పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదరించాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు అన్నారు. వైరా మండలం విప్పలమడక గ్రామపంచాయతీలో బీఆర్ఎస్, జనసేన బలపర్చిన సర్పంచ్ సీపీఎం అభ్యర్థి ముత్తమల సంపూర్ణ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు.
KMR: ఎల్లారెడ్డి మండలంలోని నాలుగు గ్రామాల్లో ఆదివారం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైన నాలుగు గ్రామాల్లో ఉప సర్పంచ్లును అధికారుల సమక్షంలో ఎన్నుకున్నారు. అజామాబాద్‌లో ఉప సర్పంచ్‌గా లింగంపల్లి సాయిలు, సోమ రేగడి తండాలో అంబి, హాజీపూర్ తండాలో ఎరుకల శ్రీరాములు, తిమ్మారెడ్డి తండాలో విసరోత్ మానియాలను ఎన్నుకున్నారు.
NGKL: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తహశీల్దార్ సైదులు అన్నారు.రే షన్ షాపులు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరచి ఉంచాలన్నారు. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేస్తామన్నారు.
BDK: బూర్గంపాడు మండలం సారపాకలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ కిషోర్ శివకుమార్ నాయక్ ప్రచార కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, విస్తృత ప్రచారంలో ఇవాళ పాల్గొన్నారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలను వివరించారు.
VKB: రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపిస్తాయని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పెద్దేముల్ ప్రచారంలో మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల్లో అనూహ్య స్పందన ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాలానగర్ ఎస్సై లెనిన్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూడళ్ల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకూడదని, రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లకూడదన్నారు. ఎన్నికల నియమాలు పాటించి శాంతిని కాపాడాలన్నారు. ఏమైనా జరిగితే 100కు ఫోన్ చేయాలన్నారు.