• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈ ప్రాంతాల్లో త్వరలో STP కేంద్రాల నిర్మాణం..!

HYD: ORR పరిధిలో 39 STP కేంద్రాల నిర్మాణం జరగనుంది. కేంద్రాల లిస్టు విడుదల కాగా.. అమీన్‌పూర్, తెల్లాపూర్, ఐక్రిసాట్, ఉష్కేబావి, బాచుగూడ, తిమక్క చెరువు, గాంధీ గూడెం, పీర్జాదిగూడ, నాగారం, నార్సింగి (ORR), సాంగం (బాపూఘాట్), హైదర్షా కోట, ఫతే నగర్, చిట్రాపురి కాలనీ, HYD పబ్లిక్ స్కూల్, మీర్‌పేట్, మసాబ్ చెరువు, కాప్రా, రవిర్యాల, బొంగులూరులో నిర్మించనున్నారు.

September 12, 2025 / 10:54 AM IST

‘మలేరప్పం గ్రామంలో పోలీసుల విస్తృత తనిఖీలు’

సత్యసాయి: మడకశిర మండలం మలేరప్పం గ్రామం, పరిసర గ్రామాల్లో శుక్రవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడాలని, ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. బాల్యవివాహాలు, పోక్సో చట్టం, పోలీసు నిబంధనలపై అవగాహన కల్పించి ప్రజలను చట్టపరమైన అంశాలలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు.

September 12, 2025 / 10:53 AM IST

పుణ్యక్షేత్రాల బస్సుల ద్వారా రూ. 32.59 లక్షల ఆదాయం

NLG: నల్గొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుండి వివిధ పుణ్యక్షేత్రాలకు 65 బస్సులు నడపడం ద్వారా రూ. 32.59 లక్షల ఆదాయం సమకూరినట్లు నల్గొండ ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జూన్‌లో 22 బస్సులు నడపడం ద్వారా రూ. 11.95, జూలై లో 22 బస్సుల ద్వారా రూ. 13.00, ఆగస్టులో 18 బస్సుల ద్వారా రూ. 6.47, సెప్టెంబర్‌లో 3 బస్సుల ద్వారా రూ 1.16 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.

September 12, 2025 / 10:50 AM IST

కుప్పకూలిన కలెక్టరేట్ స్లాబ్.. తొలగించని శిథిలాలు

TG: ఆదిలాబాద్ జిల్లాలో నిన్నరాత్రి కలెక్టరేట్ స్లాబ్ కుప్పకూలింది. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. స్లాబ్ వ్యర్ధాలు ఉండటంతో ఆఫీస్‌కు వెళ్లే మార్గం మూసివేశారు. నిన్నరాత్రి నుంచి శిథిలాలు తొలగించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. పాత భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేయడం వల్ల ఇలా జరిగినట్లు సమాచారం.

September 12, 2025 / 10:49 AM IST

రేపు జాతీయ లోక్ అదాలత్

VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఈనెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద కేసులు, రాజీ పడతగిన క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

September 12, 2025 / 10:43 AM IST

రాష్ట్రంలో 1.6 శాతం బాల్య వివాహాలు

AP: రాష్ట్రంలో జరుగుతున్న పెళ్లిళ్లలో 1.6 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఈ రేటు 2 శాతం ఉండగా.. పట్టణాల్లో 0.4 శాతంగా ఉంది. తాజాగా విడుదలైన నమూన గణన-2023 నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. దేశంలో అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 6.3%, జార్ఖండ్ (4.6%), ఛత్తీస్‌గఢ్ (3.0%) నిలిచాయి. అత్యల్పంగా కేరళ 0.1%, హర్యానా (0.6%), హిమాచల్‌ప్రదేశ్ (0.4%) ఉన్నాయి.

September 12, 2025 / 10:42 AM IST

‘ఫోటోగ్రాఫర్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన MLA అనిల్ జాదవ్’

ADB: తెలంగాణ రాష్ట్ర ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోషియేషన్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్లను MLA అనిల్ జాదవ్ నేరడిగొండలోని ఆయన నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు. ప్రతి చిత్రాన్ని జ్ఞాపకంగా చిత్రీకరించడంతో ఫోటోగ్రాఫర్ల పాత్ర కీలకమని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు సంతోష్, సంఘం అధ్యక్షులు, తదితరులున్నారు.

September 12, 2025 / 10:41 AM IST

దసరా ఉత్సవాలకు మంత్రి రవీంద్రకు ఆహ్వానం

కృష్ణా: బెజవాడ దుర్గమ్మ దేవస్థానంలో దసరా ఉత్సవాలకు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఆహ్వానం లభించింది. శుక్రవారం మచిలీపట్నంలోని మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందచేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనవలసినదిగా దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ఈవో, వేద పండితులు పాల్గొన్నారు.

September 12, 2025 / 10:41 AM IST

VIDEO: మహిళ సూసైడ్.. నలుగురిపై కేసు నమోదు

NLR: కలిగిరిలోని ఎర్ర తోటకు చెందిన మాధవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెతో మధు అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. అయితే మధు కుటుంబ సభ్యులు మాధవిపై దాడి చేయడంతో ఆమె మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మధుతోపాటు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.

September 12, 2025 / 10:40 AM IST

మత్తు పదార్థాల నిర్మూలణకు సీపీఐ వినతి

MHBD: మరిపెడ మండలంలో శుక్రవారం సీపీఐ మండల కార్యదర్శి బాలకృష్ణ ఎస్సై కోటేశ్వరరావుకు మత్తు పదార్థాల నిర్మూలణకు వినతిపత్రం అందజేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. యువత భవిష్యత్తు మత్తు పదార్థాల వల్ల నాశనమవుతుందని, అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, తదితరులు ఉన్నారు.

September 12, 2025 / 10:39 AM IST

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

ELR: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య కృష్ణ కాలువ, లోతట్టు ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు. అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

September 12, 2025 / 10:38 AM IST

‘విద్యార్థులకు హోంవర్క్ తప్పనిసరిగా అందించాలి’

SKLM: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తప్పనిసరిగా హోంవర్క్ అందించాలని ఎంఈవో 2 ఎం వర ప్రసాద్ రావు ఆదేశించారు. శుక్రవారం జలుమూరు మండలం ఈదులవలస పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థుల వర్క్ బుక్కులను, హోంవర్క్‌లను ఆయన పరిశీలించి తగు సూచనలు అందజేశారు. రీడింగ్, డిక్టేషన్ ప్రతిరోజు నిర్వహించాలని ప్రాథమిక స్థాయి నుండి దీనిని ఒక అలవాటుగా చేయాలన్నారు.

September 12, 2025 / 10:38 AM IST

ముదినేపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు

ELR: గడచిన 24 గంటల్లో ఏలూరు జిల్లాలో ముదినేపల్లి మండలంలో అత్యధికంగా 6.6 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం వర్షపాతం 28.6 మి.మీ కాగా, సగటున 1.0 మి.మీ నమోదైందని అధికారులు శుక్రవారం తెలిపారు. అత్యల్పంగా ఏలూరు రూరల్, ఏలూరు అర్బన్ మండలాల్లో 0.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే 17 మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

September 12, 2025 / 10:37 AM IST

జిల్లాలో భారీ వర్షాలు.. కలెక్టర్ హెచ్చరిక

BHPL: భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో గత రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని తెలిపారు. చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు ఉండవద్దని ఆయన సూచించారు.

September 12, 2025 / 10:36 AM IST

మంగళగిరిలో PDS బియ్యం పట్టివేత

GNTR: మంగళగిరిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆటోనగర్‌లోని నాలుగో లైన్‌లో పార్క్ చేసి ఉన్న మినీ వ్యాన్‌ను తనిఖీ చేయగా, పీడీఎస్ బియ్యం బయటపడినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. ఆటోనగర్‌లోని ఓ గోదాముకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నారని, అక్కడ తనిఖీ చేయగా మరో 70 బ్యాగులు లభ్యమయ్యాయని అన్నారు.

September 12, 2025 / 10:34 AM IST