»Hollywood Critics Association Awards 2023 Rrr Movie Team Bags 5 Awards
HCA Awards: అవార్డుల పంట.. RRRకు మరో 5 అంతర్జాతీయ పురస్కారాలు
ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా ప్రతిభను గుర్తించి అవార్డులు ప్రకటించిన HCAకు కృతజ్ఞతలు. ఇది కేవలం నాకే కాదు, నా చిత్రానికే కాదు మా భారతీయ సినిమా పరిశ్రమకు దక్కిన గౌరవం. మేరా భారత్ మహన్. జై హింద్
తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా RRR (రౌద్రం, రణం, రుధిరం). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొడుతోంది. ఏ కేటగిరిలోనైనా.. ఏ అవార్డైనా తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం ఆ చిత్ర బృందానికి ఆస్కార్ అవార్డు ఊరిస్తోంది. ‘నాటు నాటు’ (Natu Natu Song) పాట ఆస్కార్ కు నామినేట్ కావడంతో అవార్డు వస్తుందనే గంపెడాశలో భారత చిత్రసీమ ఉంది. అయితే దానికన్నా ముందే RRRకు మరిన్ని అవార్డులు లభిస్తున్నాయి. ఇటీవల ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF)లో ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్-2022 చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా తాజాగా హాలీవుడ్ సినిమా వాళ్లు ప్రతిష్టాత్మక భావించే అవార్డుల్లో 5 అవార్డులను మన ఆర్ఆర్ఆర్ కొల్లగొట్టింది. దీంతో మరోసారి ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ వేదికగా మెరిసింది. అవార్డు అందుకున్న అనంతరం దర్శకుడు రాజమౌళి ‘ఇది భారత సినిమాకు దక్కిన గౌరవం’ అని తెలిపాడు.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (Hollywood Critics Association -HCA) అందించే అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ కు ఐదు దక్కాయి. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా త్రిబుల్ ఆర్ అవార్డులు గెలుచుకుంది. ఇక వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినిమాగా ‘హెచ్ సీఏ స్పాట్ లైట్’ అవార్డును కూడా ఆర్ఆర్ దక్కించుకోవడం విశేషం. అమెరికాలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan Tej), దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) కలిసి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి చిత్రంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ కు బెస్ట్ స్టంట్స్ అవార్డు అందించిన మీకు ధన్యవాదాలు. ఎంతో శ్రమించి స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్, క్లైమాక్స్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కంపోజ్ చేసిన జూజీతోపాటు మా సినిమా కోసం భారత్ కు వచ్చి మాకు అనుగుణంగా కష్టపడి పని చేసిన స్టంట్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. సినిమాలో రెండు, మూడు షాట్స్ మాత్రమే డూప్స్ ని ఉపయోగించాం. మిగతావన్నీ రామ్ చరణ్, ఎన్టీఆర్ స్వయంగా చేశారు. వాళ్లిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. 320 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ చేయగా.. వాటిలో ఎక్కువ భాగం స్టంట్స్ కోసమే పని చేశాం. దాదాపు 600 మంది బృందంతో కొన్నిసార్లు 2 వేల కంటే ఎక్కువ మంది ఆర్టిస్టులతో ఈ సినిమా రూపొందించాం. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా ప్రతిభను గుర్తించి అవార్డులు ప్రకటించిన HCAకు కృతజ్ఞతలు. ఇది కేవలం నాకే కాదు, నా చిత్రానికే కాదు మా భారతీయ సినిమా పరిశ్రమకు దక్కిన గౌరవం. మేరా భారత్ మహన్. జై హింద్’ అంటూ రాజమౌళి ప్రసంగం ముగించారు.