Star Fruit : స్టార్ ఫ్రూట్ ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి.. ఎందుకంటే?
అరుదుగా కనిపించే పండ్లలో స్టార్ ఫ్రూట్స్ ఒకటి. వీటిలో దొరికే పోషకాలు ఏంటో తెలిస్తే వీటిని ఎక్కడ కనిపించినా వదలకుండా తింటారు. ఆ వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
Star Fruit : స్టార్ ఫ్రూట్స్ మార్కెట్లో ఎక్కువగా కనిపించవు. అయితే చెట్టు ఉన్నవారికి మాత్రం సమృద్ధిగా అందుబాటులో ఉంటూ ఉంటాయి. ఇవి పండిన తర్వాత కాస్త తియ్యగా, కాస్త పుల్లగా, కాస్త వగరుగా ఉండి క్రంచీగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో లభించే ఈ పండ్లను తినడం అస్సలు మిస్ చేసుకోవద్దని అంటున్నారు.
స్టార్ ఫ్రూట్‌ని(Star Fruit) తెలుగులో నక్షత్ర ఫలం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. దీనిలో పీచుపదార్థాలు, ప్రొటీన్, విటమిన్ సీ, విటమిన్ బీ5, ఫోలేట్, కాపర్, పొటాషియం, మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి తినడం వల్ల వాపుల్లాంటివి తగ్గుతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అందుకు సహకరిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల వ్యాధుల్ని మన దరి చేరనీయవు..
బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్న వారు స్టార్ ప్రూట్స్(Star Fruits) తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి మెటబాలిజంను వేగవంతం చేస్తాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. ఇంకా వీటిలో క్యాలరీలు సైతం తక్కువ. అందువల్ల బరువు తగ్గడంలో సహాయపడతాయి. కొలస్ట్రాల్ ఇబ్బందులు ఉన్న వారు తరచుగా ఈ పండును తింటూ ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది కొలస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించి గుండె సంబంధిత జబ్బులు రాకుండా చేస్తుంది. దీనిలో ఉన్న పొటాషియం రక్తపోటును అదుపు చేస్తుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుందనుకున్నాం కదా. అది జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహకరిస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, విరాచనాల్లాంటి వాటిని తగ్గిస్తుంది.