ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా తామే గెలిచి తీరుతామంటూ… ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ప్రజల ముందుకు వెళ్లబోతున్నామని వెల్లడించారు. తమకు ఇప్పుడు జాతీయ రాజకీయాలకంటే.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు. జి-20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ విలేకర్లతో మాట్లాడారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం కొంతవరకే ఉంటుందని.. ప్రజావ్యతిరేకత వచ్చినప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినా పనిచేయదని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్నంత వేధింపులు గతంలో ఎన్నడూ చూడలేదని చంద్రబాబు చెప్పారు. ఓడిపోతామన్న భయంతో ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు ఎన్నికల సమయంలో హింసకు తెగబడతారని ఆనుమానాలు వ్యక్తం చేశారు.
ఏపీలో ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ఎంత హింసకు పాల్పడితే.. ప్రజల నుంచి అంతకు రెట్టింపు ప్రతిఘటన వస్తుందని వ్యాఖ్యానించారు. జగన్ పాలన పట్ల విసుగెత్తిపోయి.. ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.