గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు రెండో విడత పోలింగ్ మొదలైంది. కాగా… ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని రాణిప్ లో గల పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. మోదీ… ఈ రోజు ఉదయం గాంధీనగర్ రాజ్ భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. రాణిప్ లోని నిషాన్ పబ్లిక్ స్కూల్ కి చేరుకున్న మోదీ… కాన్వాయిని కొంత దూరంలో ఆపి.. ఆయన స్వయంగా నడుచుకుంటూ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆయన సామాన్య ప్రజలతో కలిసి క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.
ఇదిలా ఉండగా… మొదటి విడత పోలింగ్ సందర్భంగా ఆశించినంత ఓటింగ్ జరగలేదు. దీంతో అన్ని పార్టీలు రెండో విడత ఎన్నికల ఓటింగ్ ఎక్కువ జరగాలని ఆశిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు 4.75 శాతం ఓటింగ్ నమోదయింది.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా మొదటి విడతలో 89 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడత ఎన్నికల్లో మొత్తం 833 మంది అభ్యర్ధులు రంగంలో దిగారు.
రెండో విడత ఎన్నికల్లో అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదర, పంచమహల్ వంటి కీలక నియోజకవర్గాలున్నాయి.రెండో విడదతో జరిగే 93 స్థానాలలో 2.54 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఈ రెండో విడతతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.