»Jangaon District Brs Mla Muthireddy Yadagiri Reddy Inspects Crop Damage In Adavi Keshavapur
Jangaon పంట నష్టంతో తల్లడిల్లిన రైతు.. MLA కాళ్లు పట్టుకున్న మహిళా రైతు
ఓ మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపించింది. కాళ్లు పట్టుకుని రోదించడం అందరినీ కలచివేసింది. తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను ప్రాధేయపడింది .తప్పకుండా ఆదుకుంటామని.. సీఎం కేసీఆర్ మీకు భరోసా ఇస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కొన్ని రోజులుగా తెలంగాణలో (Telangana) అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లు, ఈదురుగాలులు, గాలివానతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. చేతికొచ్చిన పంట, ధాన్యం, కాత వర్షాలకు నీటి పాలవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ఆదుకుంటామని చెబుతున్నా రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కనిపించిన ప్రజాప్రతినిధిని, అధికారులను కాళ్లవేళ్లా పడుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మొన్న కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar)ను అలాగే ప్రార్థించగా.. తాజాగా బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) కాళ్లపై ఓ రైతు పడ్డారు.
జనగామ జిల్లాలో (Jangaon District) అకాల వర్షాలు (Untimely Rains) బీభత్సం సృష్టించాయి. పంట నష్టం తీవ్రంగా వాటిల్లడంతో సీఎం కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రంగంలోకి దిగారు. నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈక్రమంలోనే అడవి కేశవాపూర్ (Adavi Keshapur) గ్రామంలో పర్యటించగా ఓ మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపించింది. కాళ్లు పట్టుకుని రోదించడం అందరినీ కలచివేసింది. తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను ప్రాధేయపడింది. ఎమ్మెల్యే వారించి మహిళా రైతును పైకి లేపి ఓదార్చారు. తప్పకుండా ఆదుకుంటామని.. సీఎం కేసీఆర్ మీకు భరోసా ఇస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కాగా జనగామ జిల్లాలో అకాల వర్షాలు రైతులను నట్టేటా ముంచుతున్నాయి. నర్మెట్ట (Nametta), బచ్చన్నపేట, తరిగొప్పుల మండలాల్లో వర్షాలకు వరి ధాన్యం (Paddy) నీటి పాలవగా.. మామిడి రైతులు (Mango Farmers) తీవ్రంగా నష్టపోయారు. మామిడి కాయలు నేలరాలాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటికి కొట్టుకుపోయింది. మిర్చి పంటకు కూడా ఈ వర్షాలు తీవ్రంగా నష్టం చేకూర్చాయి. ఆయా పొలాలను అధికారులు పరిశీలించి నష్ట పరిహారం అంచనా వేస్తున్నారు.