Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక ఫార్ములా అమలు చేస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఇక్కడ అదీ సక్సెస్ అవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యం అంటున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ నేతలతో టీ కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు.
120 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎలా ముందుకెళ్లాలనే అంశంపై డీప్‌గా కాంగ్రెస్ నేతలు చర్చించారు. రెండున్నర గంటలపాటు సమావేశం జరిగింది. పదేళ్లలో టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం గురించి ప్రజలకు ఎలా వివరించాలనే అంశంపై చర్చించామని రేవంత్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. అవినీతి ఆకాశానికి పొంగితే.. అభివృద్ధి పాతాళంలోకి చేరిందన్నారు. రాహుల్ గాంధీ, మల్లకార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తమ అనుభవాలను తమతో పంచుకున్నారని వివరించారు. కర్ణాటకలో అనుసరించిన వ్యుహాలను ఇక్కడ అమలు చేస్తామని వివరించారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెబుతున్నారు.
అంతకుముందు మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ ఠాక్రే.. తెలంగాణ , మహారాష్ట్రలో బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం లూఠీ చేసిందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన తెలంగాణలో సామాన్య ప్రజల ఆశయాలు, ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు దోపిడికి గురవుతున్నారని పేర్కొన్నారు.