పౌరహక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్(Professor Haragopal)పై దేశద్రోహం కేసు నమోదైంది.మావోయిస్టులకు సహకరిస్తున్నారని ఆరోపణలతో ములుగు జిల్లా(Mulugu District) తాడ్వాయి పీఎస్ లో ఉపా, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మావోయిస్టులు(Maoists) తమలాంటివారిపై ఆధారపడరని, వాళ్ల మార్గం వేరని ఆయన అన్నారు. మావోయిస్టుల పుస్తకాల్లో తన పేరు ప్రస్తావనకు వస్తే తనకేం సంబంధం అని చెప్పారు. తెలంగాణ (Telangana) దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరమని హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారిపై కూడా కేసులు దారుణమని ఆయన అన్నారు.ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధం అని అన్నారు. తనతో పాటు మొత్తం152 మందిపై కేసు పెట్టడం విషాదమన్నారు.
ఉపా చట్టాన్ని(Uapa Chattam) వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా 2022 ఆగస్టులో ప్రొఫెసర్ హరగోపాల్ పై ఈ కేసు నమోదు కాగా.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులపై ఏఏ కేసులు ఉన్నాయో బయటకు తీయాలని సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశించారని, ఆ క్రమంలోనే దేశద్రోహం కేసు బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ కూడా మీడియాకు తెలిపారు.హరగోపాల్ పై UAPA కింద కేసు పెట్టడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) తీవ్రంగా స్పందించారు. ప్రొ.హరగోపాల్ పై ఉపా కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు.