ADB: గుడిహత్నూర్ మండలంలోని బెల్లూరి గ్రామానికి చెందిన సూరిండ్ల జ్యోతి అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం సాయంత్రం పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది.
SDPT: హుస్నాబాద్ డివిజన్ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు అయిలేని మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు ఎంతో కష్టపడి, అధిక పెట్టుబడులు పెట్టి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
SRCL: వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కొనరావుపేట మండలం మర్తన్నపేట, కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
MDK: డిగ్రీ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తూప్రాన్‌లో చోటుచేసుకుంది. బిహార్‌కి చెందిన షరీఫ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కొన్నేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. అతడి కుమారుడు అబ్బు (20) ప్రైవేటు కళాశాలలో B.Com ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న ఇంట్లో నుంచి వెళ్లిన అబ్బు రావెల్లి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
JN: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనగామ జిల్లా మూడో మహాసభను ఈనెల 16న లింగాల ఘనపురంలో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా నాయకుడు సింగారపు రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికుల సమస్యలు, హక్కులపై ఇందులో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని కోరారు.
JGL: జగిత్యాల మార్కెట్లో ఈరోజు పలికిన దినుసుల ధరలు ఇలా ఉన్నాయి.. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 1,886, కనిష్ఠం రూ. 1,829గా పలకగా, వరి ధాన్యం (1010) గరిష్ఠం రూ. 1,752, కనిష్ఠం రూ. 1,726 ధరలు, వరి ధాన్యం (JSR) రూ. 2,126గా ధర పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్‌కు ధాన్యం తక్కువగా వస్తుంది.
NZB: ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్‌లో నిర్వహించిన ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్’ (AICM)117వ కార్యవర్గ సమావేశంలో NZB నగర మేయర్ ఉమారాణి పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు మేయర్లు, పట్టణాభివృద్ధి నిపుణులు హాజరయ్యారు. పట్టణ పాలనలో నూతన విధానాలు, మౌలిక వసతుల కల్పనపై విస్తృతంగా చర్చించారు.
SRPT: సూర్యాపేట జిల్లాలో సర్వీసు కాలం పూర్తి చేసుకున్న 77 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 25 మంది కానిస్టేబుళ్లకు పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేశారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, కోరుకున్న చోట పోస్టింగ్ పొందిన సిబ్బంది తమ అనుభవాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ADB: మే 2026 పెన్షన్ డబ్బుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి జీవో విడుదల చేయకుండా బేసిక్ పే నుంచి 1.5 శాతం అమౌంట్‌ను డిడక్షన్ (కోత విధించడం ) చేయడం చాలా అన్యాయమని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఎం. మురళీధర్‌లు పేర్కొన్నారు.
NRML: ఖానాపూర్ మండలం బాదన్ కుర్తిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ప్రారంభించారు. టెంకాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవారి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.
KMR: పిట్లం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో బుధవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అధ్యక్షతన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, వైద్య సేవల మెరుగుదలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ విజయ్ భాస్కర్, సర్పంచ్ శేఖర్, ఆసుపత్రి సూపరిండెంట్ రవీందర్ మోహన్ వున్నారు.
MNCL: వరి కొయ్యలను కాలిస్తే భారీ జరిమానా విధించడం జరుగుతుందని మంచిర్యాల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణ హెచ్చరించారు. బుధవారం జన్నారం మండలంలోని చింతగూడ రైతు వేదిక యందు వరి కొయ్యలను(పంట వ్యర్థాలు) కాల్చడం ద్వారా కలిగే దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించారు. వరి కొయ్యలను కాల్చే పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయని, దిగుబడి తగ్గిపోతుందన్నారు.
MDK: మేడ్చల్- ముద్ఖేడ్ రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులపై ఆర్డీవో జయచంద్రరెడ్డి సమీక్ష నిర్వహించారు. గతంలో 2.06 ఎకరాల భూమి భూసేకరణ పూర్తయ్యిందని, మరో 7 ఎకరాల భూమి అవసరమని రైల్వే శాఖ నుంచి రిక్విజిషన్ అందిందన్నారు. ఈ భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత తహసీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రైల్వే కన్సల్టెంట్ రమేష్ పాల్గొన్నారు.
WNP: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
JGL: రాయికల్ పట్టణంలోని వాటర్ బెడ్ సమీపంలో రైతు మోసరపు సాయబుకు చెందిన ఆయిల్ పామ్ తోటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. చేతికొచ్చిన పంట దశలో ఉన్న సుమారు 60 ఆయిల్ పామ్ చెట్లు అగ్నికి ఆహుతై భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా చేరుకోవడంతో మంటలు మరింత వ్యాపించి నష్టం పెరిగిందని పేర్కొన్నారు.