»Ktr Comments On Central Minister False Statements On Medical Colleges
KTR: కేంద్ర మంత్రులు అబద్ధాలు ఒకే విధంగా చెప్పాలి
తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీల అంశంపై కేంద్ర కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా అబద్ధాలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రధాని మోదీ తమ మంత్రులకు ఒకే అబద్ధం చెప్పే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై కేంద్ర కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా అబద్ధాలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్(ktr) ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) తొమ్మిది మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని చెప్పగా, ఇదే అంశంపై మరో కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ(mansukh mandaviya) అసలు ప్రతిపాదనలు అందలేదని చెప్పినట్లు గుర్తు చేశారు. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం మెడికల్ కాలేజీల అంశంపై తమకు రెండు ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీజీ(pm modi) మీ మంత్రులకు కనీసం ఒకే అబద్ధం చెప్పే విధంగా శిక్షణ ఇవ్వాలని కేటీఆర్(ktr) ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు ఇటీవల సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి సహా పలు అంశాలు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. కేంద్రం లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఆ క్రమంలో కేంద్రంలో అసమర్థ పాలన కొనసాగుతుందని, మరోవైపు తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడంలో అద్భుత నెర్పరి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) తమపై విమర్శలు చేసేవారు ఒకసారి వారి రాష్ట్ర పరిస్థితి గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అంతేకాదు దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే క్రమంలో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాల పేర్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఆ క్రమంలో వచ్చిన ప్రతిపాదనలను తిరిగి పంపినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్(kcr) కు రాష్ట్రంలో ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో కూడా తెలియదా అంటూ నిర్మలా కౌంటర్ ఇచ్చారు. ఇక నిర్మల వ్యాఖ్యలతోపాటు పలువురు కేంద్ర మంత్రుల కామెంట్లపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు.