అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పులలో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. మరొక విద్యార్థికి గాయాలు అయ్యాయి. వీరితోనే ఉన్న మరో తెలుగు విద్యార్థి కాల్పుల ఘటన నుండి బయటపడ్డారు. విజయవాడకు చెందిన నందెపు దేవాశిష్ హైదరాబాద్‌లో ఉంటూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. తెలంగాణలోని సంగారెడ్డి రామచంద్రాపురంకు చెందిన సాయిచరణ్ ఈ నెల 11న అమెరికాలో ఎంఎస్ కోసం వెళ్లారు. వీరు చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. వీరు లక్ష్మణ్ అనే స్నేహితుడితో కలిసి రూటర్ కోసం బస్సులో వాల్‌మార్ట్‌కు వెళ్తున్నారు. ఒక నల్లజాతి వ్యక్తి వారిని అనుసరించాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం గం. 6.55కు వాల్‌మార్ట్ బస్టాప్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే మరో నలుగురు కారులో వీరి వద్దకు వచ్చారు. నడుస్తున్న వారిని ఆపి తుపాకీతో బెదిరించి సెల్ఫోన్లు ఇవ్వమని అడగగా… వెంటనే వీరు తమ ఫోన్లు అక్కడ పెట్టారు. సాయిచరణ్.. మీకు ఫోన్లు ఎందుకు, మా వద్ద డబ్బు ఉంది తీసుకోండని చెప్పాడు.
అదే సమయంలో విద్యార్థుల్లో ఒకరు వారి చేతుల్లోనివి బొమ్మ తుపాకులు అనడంతో దుండగులు వీరిపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఒక తూటా సాయిచరణ్ పొట్ట భాగంలోకి దూసుకుపోయింది. మరో తూటా దేవాశిష్ కుడిభుజం కింది భాగంలోకి దూసుకెళ్లింది. దీంతో సాయిచరణ్ నోట్లో నుండి రక్తం రావడం ప్రారంభమైంది. ఆ సమయంలో దేవాశిష్ బాగానే ఉన్నాడు. దేవాశిష్, లక్ష్మణ్ 911కు కాల్ చేయగా పోలీసులు అంబులెన్స్‌తో సహా వచ్చి వారిని తీసుకుని హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే సాయిచరణ్ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. సీపీఆర్ తో బతికాడు. ఊపిరితిత్తులకు ఎడమవైపు తూటా గాయమైన అతడికి వైద్యులు ఆపరేషన్ చేసి బుల్లెట్‌ను బయటకు తీశారు. కోలుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పెద్దగా ప్రమాదం లేదని భావించిన దేవాశిష్ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.