మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలోని యువతను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని విమర్శించారు. ఏటా జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ యువతకు జగన్ రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ల మాటే మరిచిపోయారని మండిపడ్డారు. 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రతో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మహా పాదయాత్రలో పాలు పంచుకోవాలని రాష్ట్ర ప్రజలకు యనమల పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు సంతోషానికి దూరమయ్యారని యనమల పేర్కొన్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు, జే ట్యాక్స్ వేధింపులతో పారిశ్రామికవేత్తలు సతమతమవుతున్నారని ఆరోపించారు.