విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ప్రశంసించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో కొలుకలూరులో ఆర్బికేని పరీశీలించారు. రైతులతో ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల (Welfare schemes) గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పని తీరుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతమని కొనియాడారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వం బాటలు వేస్తుందని ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో క్రికెట్ అకాడమీలు (Cricket academies) ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. దీనికోసమే ఇప్పటికే రెండు సార్లు సీఎం వైఎస్ జగన్ (CMJAGAN)ను కలిసినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని, తమ తాత నుంచి నేర్చుకున్నట్లు రాయుడు వెల్లడించారు. అందులో భాగంగానే ప్రజలతో మమేకం అవుతూ పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపాడు. వైసీపీ(YCP) ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగున్నాయంటూ ఆయన కితాబిచ్చారు. ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు.