KDP: కమలాపురంలో ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న ఉరుసు ఉత్సవాల గోడపత్రాలను కన్వీనర్ ఇస్మాయిల్ హిందూ క్రైస్తవులతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. ఈ ఉత్సవాల్లో నాలుగు రోజుల పాటు నిత్యం అన్నదానం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 3న నిర్వహించే ఎద్దుల బండలాగుడు పోటీల్లో విజేతలకు రూ. 50 వేలు, 30 వేలు, 20 వేలు, 10 వేలు చొప్పున బహుమతులు అందజేస్తారన్నారు.
VSP: పీఎం పాలెం పరిధిలో శ్రీనివాసనగర్‌కు చెందిన పైల రఘు (38) ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు పీఎంపాలెం స్టేషన్‌లో కేసు నమోదైందని సీఐ జి. బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చేవాడు. భార్య సీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
W.G: ఆకివీడులో పెదపేటలో శ్రీరామనవమి వేడుకల్లో శుక్రవారం జరిగిన ఘర్షణకు సంబంధించి ఐదుగురిని గాయపరచిన కేసులో 57 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంత నాగరాజు చెప్పారు. ఆకివీడు మండల పరిధిలో శుక్రవారం నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్సై వివరించారు. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించకూడదన్నారు.
ATP: గుంతకల్లు రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ పరిధిలో పరిపాలనా భవనం, రైల్వే సిబ్బందికి సంబంధించిన క్యాంటిన్‌ను శుక్రవారం సాయంత్రం గుంతకల్లు డివిజనల్ రైల్వే మ్యానేజర్(డీ.ఆర్.ఎం) చంద్రశేఖర్ గుప్తా ప్రారంభించడం జరిగింది. ఈ పరిపాలనా భవనంలో కాన్ఫరెన్స్ రూమ్, ఆఫీసర్స్ ఛాంబర్, టెక్నికల్ రూమ్ కలిగి ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
KKD: కిర్లంపూడి మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బాయిశెట్టి హరికృష్ణ తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షుడు తోట రవి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మండల అభివృద్ధి, బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.
BPT: చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం పంచాయతీ పుషాడపువారిపాలెంలో శనివారం పశువైద్య ఉచిత శిబిరం నిర్వహిస్తున్నట్లు యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి శిబిరం మొదలవుతుంది. పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువుల ఆరోగ్య పరీక్షలు, ఔషధాల పంపిణీ ఉంటుందని తెలిపారు.
ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 28 మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. బస్సులో సజీవ దహనమైన 14 మంది డీఎన్ఏని వైద్యులు పరీక్షిస్తున్నారు. నేడు పరీక్షలు పూర్తయిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నేటి సాయంత్రంలోపు మృతదేహాలను అప్పగించే అవకాశంవుంది.
ATP: విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లిలోని పాత ఇంట్లో ‘రణబాలి’ చిత్ర షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. హీరో విజయ్ దేవరకొండపై కీలక సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరించింది. నాలుగు రోజులపాటు ఇక్కడ షూటింగ్ కొనసాగనుంది. సినీ బృందం రాకతో గ్రామంలో సందడి నెలకొనగా, అభిమానులు భారీగా తరలివచ్చారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.
ATP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ కోసం ఎగ్జామినర్లను తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా నియమించనున్నట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. పరీక్షల నిర్వహణ మాదిరిగానే మూల్యాంకన విధులకు సంబంధించిన నియామక ఉత్తర్వులను ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ల ద్వారా నేరుగా పంపనున్నారు.
GNTR: తాడేపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా శనివారం సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో సీతారాముల తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. దుర్గగుడి అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి, ఈ తెప్పోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
BPT: నరసరావుపేటలో నేస్తం ట్రస్టు, ఏపీ కార్టూనిస్టుల సంఘం ఆధ్వర్యంలో నేడు రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శన జరగనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పోలా త్రివిక్రమరావు, కార్టూనిస్ట్ సంఘం అధ్యక్షుడు అన్నం శ్రీధర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్టూన్లు-ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అనే అంశంపై చర్చావేదిక ఉంటుందన్నారు.
ASR: సీలేరు మండలం ధారకొండలో శనివారం ఉదయం 9 గంటల నుండి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్థానిక పీఎస్సీ వైద్యులు బాబ్జి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చింతపల్లి సామాజిక ఆసుపత్రి నుంచి వైద్య బృందం వస్తుంది. శస్త్రచికిత్సలు అవసరమైనవారిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సులు తీసుకురావాలి.
కోనసీమ: పి.గన్నవరం మండలం నరేంద్రపురంకి చెందిన శేషారత్నం, పోతవరంకి చెందిన శ్రీలక్ష్మి మస్కట్ నుంచి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు సెంటర్ ఫర్ మేగ్రేషన్‌ను సంప్రదించగా కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో వారి రాక సాధ్యం అయింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గుర్తింపు పొందిన ఏజెంట్లు ద్వారానే విదేశాలకు వెళ్లాలని సూచించారు.
E.G: కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన ఆర్డివో కె. ఆనందరావు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, రానున్న పుష్కరాల ఏర్పాట్లపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా పుష్కరాల నేపథ్యంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్లు పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ATP: శ్రీ రామనవమి పర్వదినం వేళ తాడిపత్రిలోని శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పెన్నానది తీరాన వెలసిన ఈ ఆలయంలో ఏటా రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.