KRNL: ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన SSC అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. దరఖాస్తు ఫారాన్ని పూరించి, కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
తూ.గో: సీతానగరం మండలం పురుషోత్తపట్నం సత్యసాయి పథకం ద్వారా గోదావరి జలాల సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూనవరం, రాపాక, బుచ్చింపేట, కృష్ణునిపాలెం సహా 15 గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోవడంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు.
కోనసీమ: అమలాపురం మండలంలోని 22 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిందని ఎంపీడీవో బాబ్జి రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయాధికారి, విద్యాశాఖ అధికారులను పలు గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారన్నారు. సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో పాలన సాఫీగా సాగేందుకు ఈ అధికారులను నియమించినట్లు తెలిపారు.
సత్యసాయి: ధర్మవరం గాండ్లవీధికి చెందిన చింతా చిన్న కొండన్న (36) రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. విశ్వదీప సేవా సంఘం అవగాహనతో తల్లి శకుంతలమ్మ, భార్య గీతాంజలి డొనేషన్‌కు అంగీకారం తెలిపారు. విజయవాడ ఎల్వీ ప్రసాద్ నేత్రాలయ టెక్నీషియన్ ప్రసాద్ నేత్ర కార్నియాలను సేకరించారు. ఈ నేత్రదానం ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపనుంది.
KDP: ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ అంకాలమ్మ అమ్మవారి తిరుణాళ్లు ఇవాళ్టి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈ తిరుణాళ్లు బియ్యం కొలతతో ప్రారంభం కాగా శనివారం బోనాల కార్యక్రమం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం పరిసర గ్రామాలలో విందు కార్యక్రమం జరగనుందన్నారు. ఈ సందర్భంగా అంకాలమ్మ అమ్మవారిని విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు.
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రాంగణ నియామకాలు నిర్వహించనున్నారు. ఈ నెల 9న కెమిస్ట్రీ విభాగంలో హెటిరో డ్రగ్స్ ఆధ్వర్యంలో డ్రైవ్ జరుగుతుంది. ఎమ్మెస్సీ, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీతో పాటు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులు పాల్గొనవచ్చు. అభ్యర్థులు విద్యార్హత పత్రాలు, రెండు ఫొటోలు తీసుకురావాలని అధికారులు సూచించారు.
అన్నమయ్య: మదనపల్లెలోని బసినికొండ అమీన్ గ్యారేజీలో నిలిపి ఉంచిన లారీలో ఇవాళ వేకువజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమై సుమారు రూ.9 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
VZM: ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులకు సీతం కళాశాలలో ఇవాళ కరస్పాండెంట్ డా బొత్స ఝాన్సీలక్ష్మి, బొత్స అనూష సన్మానించారు. వారు మాట్లాడుతూ.. సీతం క్రీడా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం, శిక్షణ అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణ రావు పాల్గొన్నారు.
కాకినాడ: రైల్వే గ్రూప్-డి పోస్టులకు దరఖాస్తు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి శ్రీనివాసరావు తెలిపారు. రాజమహేంద్రవరంలోని బీసీ స్టడీ సర్కిల్లో 100 మందికి శిక్షణ ఇస్తామన్నారు. ఈ నెల 8 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అర్హులు రాజమండ్రి, కాకినాడ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తు ఇవ్వాలన్నారు.
KRNL: ఆలూరు ఎమ్మెల్యే బుసినే వీరుపాక్షి సోదరుడు బుసినే మారెప్ప అనారోగ్యంతో ఇవాళ చిప్పగిరిలో కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే MLA వీరుపాక్షి అక్కడికి చేరుకుని ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మారెప్ప మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల వైసీపీ నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
VSP: కూర్మన్నపాలెం వద్ద విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాల్లో ఆరు టన్నుల రేషన్ బియ్యం తరలిస్తుండగా రైస్ మిల్లర్ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి ఈ బియ్యాన్ని పట్టుకున్నారు. మూడు వాహనాలను శ్రీనగర్‌లో గల ఎఫ్ సీఐ గోదాముకు తరలించి కేసు నమోదు చేశారు.
ASR: ఒక కోడిగుడ్డులో ఒక్క పిల్ల పుట్టడం సహజం. అందుకు భిన్నంగా ఒకే గుడ్డులో రెండు కోడి పిల్లలు పుట్టుకొచ్చాయి. జీకేవీధి (M) కొత్తగూడెంలో బుడి ప్రసాద్ అనే గిరిజనుడి నాటు కోడిపెట్ట గుడ్లు పెట్టింది. శుక్రవారం ఆ గుడ్లు పొదిగే సమయంలో ఒక గుడ్డులో రెండు పిల్లలు పుట్టి కొద్ది సేపటికే చనిపోయాయి. జన్యుపరమైన సమస్య వల్లే ఇలా జరుగుతుందని పశు వైద్యాధికారి రమేష్ తెలిపారు.
KDP: ఒంటిమిట్ట కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం కాలియమర్దన అలంకారంలో శ్రీ రాముడు గ్రామ పురవీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా స్వామి వారి ఊరేగింపులో అడుగడుగున కోలాటాలు, భజనలు, కేరళ వాయిద్యాలు అలరించాయి. స్వామి వారికి భక్తులు కాయకర్పూరం సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఇవాళ సాయంత్రం అశ్వ వాహనంపై కోదండ రాముడు ఊరేగనున్నారు.
BPT: ప్రజల భద్రత దృష్ట్యా రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు కట్టుదిట్టమైన వాహనాల తనిఖీలు నిర్వహించారు. చందోలు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో అనుమానాస్పద వాహనాలను ప్రత్యేకంగా పరిశీలించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపంలో గల శ్రీ విరుపాక్షి మారమ్మ శుక్రవారం సందర్భంగా పసుపు, కుంకుమ అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను పల పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పసుపు,కుంకుమ, వెండి కిరీటంతో ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.