కూతురు వయసయ్యే బాలికపై అత్యాచారం చేసి ఆపై బాలికను కర్కశంగా హత్య చేసిన నిందితుడికి ఉరి శిక్ష ఖరారైంది. మానవత్వం లేకుండా అభంశుభం తెలియని బాలికపై పాశవికంగా ప్రవర్తించిన నిందితుడికి ప్రకాశం జిల్లా కోర్టు మరణశిక్ష వేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఘటన జరిగిన రెండేళ్లకు అతడికి శిక్ష పడింది. ప్రకాశం జిల్లాలో 8 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టిన పోలీసులు చివరకు కోర్టులో అతడిని నిందితుడిగా నిరూపించి శిక్ష పడేలా చేశారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామానికి చెందిన వ్యక్తి దూదేకుల సిద్దయ్య. 2021 జూలై 8వ తేదీన కూతురు వరుసయ్యే ఎనిమిది సంవత్సరాల బాలికపై కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో ఆ బాలికపై అత్యాచారం చేసి తన కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం బాలిక ఎవరికైనా ఈ విషయం చెబుతుందనే భయంతో సిద్ధయ్య కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పూర్తి సాక్షాలను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ దారుణ ఘటనపై విచారించిన జిల్లా కోర్టు నిందితుడు చేసిన నేరం తీవ్రమైనదిగా భావించింది. ఇలాంటి వ్యక్తికి పడాల్సింది ఉరిశిక్షనేనని నిర్ధారించింది. సిద్ధయ్యకు మరణశిక్ష ఇస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసి ఆపై క్రూరంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష పడడంపై కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.