Supreme Court hearing on Andhra Pradesh capital Amaravati on 11th of this month
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రరాజధాని విషయంలో రాజకీయనేతలు మిశ్రమ అభిప్రాయాలను వెలుబుచ్చుతూ రాజధాని వ్యవహారాన్ని ఎటు సాగనీయకుండా చేస్తున్నారు. అయితే విషయంపై ఈ నెల సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను ఈ నెల 11న విచారించనున్నట్లు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ బేలా, ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించనుంది. గతంలో జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. కానీ ఆయన పదవీ విరమణ నేపథ్యంలో అమరావతి రాజధాని కేసులు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలలోపు ఈ రాజధాని సమస్య పరిష్కారం అవుతుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం మూడున్నర సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసింది. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించింది. అప్పటి నుంచి రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన ప్రజలు ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని, అభివృద్ధి చేయాలంటూ వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.