తిరుమల(Tirumala)లో భక్తుల తాకిడి ఎక్కువైంది. వేసవిలో రద్దీ కారణంగా ప్రతి రోజూ శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు అంతా కలిపి 55 వేలు మాత్రమే టీటీడీ(TTD) కేటాయిస్తోందని ఈవో ధర్మారెడ్డి(EO Dharmareddy) తెలిపారు. టీటీడీ(TTD) పేరుతో ఉన్నటువంటి 52 నకిలీ వెబ్ సైట్లు(Fake Websites), 13 నకిలీ మొబైల్ యాప్ల(Fake Mobile apps)ను గుర్తించినట్లు తెలిపారు. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్ల గురించి ఎవరికైనా తెలిస్తే 155257 కాల్ సెంటర్ కు సమాచారం అందించాలని ఈవో ధర్మారెడ్డి కోరారు.
సర్వదర్శనంలో రోజుకు 10 నుంచి 15 వేల మందికి మాత్రమే దర్శనం కల్పిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి(EO Dharmareddy) తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్లో పాదరక్షలు భద్రపరిచే కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త్వరలో నారాయణగిరి క్యూలైన్లు, రాంభగీచా, సుపథం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద పీఏసీని ప్రారంభిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
అలాగే అలిపిరి నడక మార్గంలో వెళ్లేటటువంటి భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ టోకెన్లు పొందినవారు అలిపిరి మార్గంలో గాలిగోపురం వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలని సూచించారు. లేకుంటే స్లాటెడ్ దర్శనానికి అనుమతి లభించదని తెలిపారు. తిరుమలలో మే 14వ తేది నుంచి 18వ తేది వరకు ఐదురోజుల పాటు హనుమత్ జయంత్యుత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి(EO Dharmareddy) వెల్లడించారు.