ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గూగుల్ నుంచి మొదలుకొని చిన్న కంపెనీల వరకు కాస్ట్ కటింగ్ బాట పట్టాయి. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ప్రభావం నేపథ్యంలో తొలగిస్తున్నాయి. రోజు ఓ కంపెనీ తమ ఉద్యోగులను తొలగించి ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. తాజాగా అమెరికన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ కాస్ట్ కట్ చేసింది. తమ కంపెనీలో 15 శాతం ఉద్యోగులను తొలగించింది. మొత్తం 1,300 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు తెలియజేసింది.
సంస్థలో ప్రతి విభాగంలో ఉద్యోగుల కోత ఉంటుందని జూమ్ సీఈవో ఎరిక్ యాన్ తెలిపారు. ‘తమ నిర్ణయం కఠినమైనందని.. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కష్టపడి పనిచేసే, నైపుణ్యం కలిగిన సహచరులను తొలగించక తప్పడం లేదని చెప్పారు. తనతోపాటు ఇతర ఎగ్జిక్యూటివ్ల వేతనంలో కోత ఉంటుందని పేర్కొన్నారు. కంపెనీ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా ఉద్యోగుల తొలగింపునకు పూర్తి బాధ్యత తనదే‘ అని తెలిపారు.
ఉద్యోగుల తొలగింపునకు బాధ్యత వహిస్తానని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనం 98 శాతం తగ్గించుకుంటానని వివరించారు. ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బృందం సభ్యులు కూడా తమ మూల వేతనాలను 20 శాతం తగ్గించుకుంటారని పేర్కొన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కార్పొరేట్ బోనస్ కోల్పోతారని తెలిపారు.