KNR: ఇల్లందకుంట మండలం వాగొడ్డు రామన్నపల్లి గ్రామంలో జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ చింతం శ్రీలత ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా సుమారు 255 పశువులకు టీకాలు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ కార్య క్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.
NRML: జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారి రాజేందర్ అన్నారు. బుధవారం టీబి రహిత తెలంగాణ, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని రాంనగర్ పీహెచ్ఎసీలో వారు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీబీ వ్యాధి నివారణకు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలో ఈ నెల 27న శ్రీ రామ నవమిని పురస్కరించుకొని భారీ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు రాళ్ల బండి మహేంద్ర తెలియజేశారు. బుధవారం పట్టణంలో స్థానిక నాయకులతో సమావేశమై మాట్లాడారు. భవ్య రాముని భారీ శోభాయాత్ర శ్రీ గోపాలకృష్ణ మఠం నుంచి ప్రారంభమై పట్టణంలోని పలు వీధుల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు.
MDK: తూప్రాన్ శివారులోని పురాతన రామాలయ శ్రీరామనవమి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి ఉత్సవాలను ఏప్రిల్ 3 వరకు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం వద్ద ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ పురోహితులు మనోహరాచార్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బైరం సత్య లింగం, తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు.
MDCL: బోడుప్పల్, రామంతాపూర్‌లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కేసులు పెరగడం, ప్రాంతాల అభివృద్ధి గణనీయంగా జరిగిన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు సైతం ఈ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంటే శాంతి భద్రతలు మరింత కట్టుదిట్టంగా అమలవుతాయన్నారు.
MHBD: దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ‘Arrive Alive’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఎస్సై పిల్లల రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ కృష్ణ కిషోర్, సీఐ గణేష్‌లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ 7 వారాల మహా జాతర త్వరలో జరగనున్నందున కొందరు దాతలు ఏర్పాట్లకు సహకరిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఖేడ్ మండలం జుక్కల్‌కు చెందిన వీరన్న భక్తుల సౌకర్యం కోసం 3 సిమెంట్ బెంచ్‌లు ఇస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బారికేడ్లను, గుడి బ్యానర్లు రాజు, రాజేష్, సూరజ్‌లు అందిస్తున్నారని చెప్పారు.
NZB: మాక్లూర్ మండలం గొట్టుముకులలో ఈ నెల 29న 10 గంటలకు లక్ష్మి నర్సింహ దేవాలయం వద్ద హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు దాత్రిక పాండు రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి పల్లిగుట్ట కేదారేశ్వరకు చెందిన కేదార్ నంద స్వామి రానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు.
NGKL: లక్ష్మాపురం గ్రామ రైతులు బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి డీ-82 కేఎస్ఐ కాల్వపై వంతెన నిర్మించాలని విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటయ్య గౌడ్, రంగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
NLG: అనుముల మండలం అనుముల వారి గూడెం గ్రామ రామాలయ ఉత్సవ కమిటీ గ్రామ పెద్దలు బుధవారం ప్రజా నాయకుడు పాండురంగారెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కోరగా, పాండురంగారెడ్డి రూ.50 వేల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హాలియా మార్కెట్ డైరెక్టర్ యాదయ్య, మారం శ్రీనివాస్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
MBNR: చెరువులను సంరక్షించకపోతే భవిష్యత్తులో తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని మహబూబ్‌నగర్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ హెచ్చరించారు. జిల్లాలోని 31 చెరువులను ఆక్రమించి ఇళ్లు కట్టుకోవడం, వ్యవసాయం చేయడంపై ఆయన ధ్వజమెత్తారు. చెరువుల ఆక్రమణలను అరికట్టాలని కోరుతూ రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.
SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ జాతర మహోత్సవ పోస్టర్‌ను మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామి కృపతో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
KMR: జిల్లాలో విపత్తు సంభవించినప్పుడు వైద్య ఆరోగ్యశాఖ ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు అంటు వ్యాధులు ప్రబలకుండా మానసిక సమస్యలపై కీలకపాత్ర పోషిస్తుంది. విపత్తు ఎదుర్కోక ముందే ముందస్తు ప్రణాళికల ప్రకారం అన్ని సిద్ధం చేస్తూ బుధవారం కలెక్టర్ ఆదేశాల మేరకు కామారెడ్డి పెద్ద చెరువు వద్ద మాక్ డ్రిల్ చేపట్టింది. DCHS డా.విజయ్ భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్వోలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఏ ఒక్క శాఖలో ఒక్క ఫైల్ పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
GDWL: జోగులాంబ గద్వాల పట్టణంలో ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ శోభయాత్రలో పాల్గొనవలసిందిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాసు హనుమంతును బజరంగ్ దళ్ నేతలు బుధవారం ఆహ్వానించారు. శోభాయాత్ర నిర్వహణ కోసం తన వంతుగా కొంత ఆర్థిక విరాళాన్ని అందజేసినట్లు బజరంగ్ దళ్ నేతలు తెలిపారు.