మునుగోడు ఎన్నికల ఎఫెక్ట్ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వివాదాన్ని మరింత పెంచేసేంది. కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి మరీ రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన.. టీఆర్ఎస్ తో బీజేపీ ఢీ అంటే ఢీ అని తలపడుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి… బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ నాయకులను బట్టలిప్పి కొడతానంటూ తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుద్ధి జ్ఞానం ఉందా? అంటూ ఓ రేంజ్ లో బీజేపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగదీష్ రెడ్డి.
శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఎరువుల గోదాంకు జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. దాంతో అదే వేదికపై ఉన్న బీజేపీకి చెందిన సింగిల్ విండో డైరెక్టర్లు ఇద్దరు.. మంత్రి వైఖరిని తప్పు పట్టారు.
దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులను బట్టలిప్పి కొడతా.. బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తినడం లేదారా? ఏం చదివార్రా మీరు? అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. ప్రస్తుతం మంత్రి జగదీష్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి.
ఈ వ్యాఖ్యలపై సదరు బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడకూడదన్నందుకు మంత్రి ఈ రీతిగా రెచ్చిపోవడంపై మండి పడుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు సహజమే కానీ.. బట్టలిప్పి కొడతా అంటూ మాట్లాడటం సంస్కారం అనిపించుకోదని అభ్యంతరం వ్యక్తం చేశఆరు. ఈ వ్యవహారంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీజేపీ డైరెక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.