ప్రకాశం: పర్చూరు అగ్ని ప్రమాదం పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కాచెల్లెళ్లు చనిపోవడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పారు. ప్రమాద ఘటన పై అధికారులతో గొట్టిపాటి మాట్లాడారు.
ADB: జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి సీతక్కను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ అలాం పట్టణంలోని పెన్ గంగా అతిథి గృహంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెకు పూల మొక్క అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలోని పలు అంశాలను మంత్రితో వారు చర్చించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులున్నారు.
MNCL: చెన్నూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ. వంద కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బందిని భర్తీ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కోరినట్లు చెప్పారు.
MNCL: చెన్నూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఐదు జిన్నింగు మిల్లులో తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి రామాంజనేయులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి నిలువలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. తదుపరి కొనుగోలు తేదీని తెలిపేంతవరకు రైతులు పత్తిని మిల్లులకు తీసుకురావద్దని సూచించారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
NRML: నర్సాపూర్(జి)మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం రోడ్డుపై కారు ఢీకొన్న ఘటనలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు నర్సాపూర్ (జి)కి చెందిన ఇద్దరు వ్యక్తులు గంగారెడ్డి, గణపతి రోడ్డుపై మార్నింగ్ వాక్ చేస్తుండగా వెనక నుంచి కారు ఢీకొనగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
NRML: ఓ వివాహిత అదనపు కట్నం వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘనట నిర్మల్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మంజులాపూర్‌కు చెందిన అశ్విని(30)భర్త, అత్తింటి వేధింపులు భరించలేక తమ ఇంట్లో పురుగుల మందు తాగింది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
WGL: గుండ్రాతిమడుగు-డోర్నకల్ రైల్వేస్టేషన్ మధ్య కేఎం నంబర్ 454-18-20 ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా తెలుస్తోంది. MHBD స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు డోర్నకల్ జీఆర్పీ ఎస్సై సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్లు ఉంటుందని అంటున్నారు.
WGL: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి అని అన్నారు.
NTR: జగ్గయ్యపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లకు ఆదివారం జగ్గయ్యపేట పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన రౌడీషీటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన లేదా వాటిని ప్రోత్సహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అలాగే సంఘ విద్రోహకర సంఘటనల్లో పాల్గొన్న ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
కృష్ణా: ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుడివాడలో ఓ దంపతులకు ఐదుగురు అమ్మాయిలు. వారి ఇంటి ముందు ఉండే జోజిబాబు(42) ఓ రైసు మిల్లులో కార్మికుడిగా పనిచేస్తుంటాడు. ఇతడికి చిన్నారి తల్లిదండ్రులే రోజూ అన్నం పెట్టేవారు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రపోతున్న చిన్నారిపై బోజిబాబు అత్యాచారం చేశాడు.
WGL: నగరంలోని జర్నలిస్ట్ భవనంలో టీయూడబ్ల్యుజే ఐజేయు జిల్లా అధ్యక్షులు రామచందర్ అధ్యక్షత న కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తీర్మానంలో నూతన సభ్యత్వం కార్యక్రమం యూనియన్ సభ్యులకు యూనియన్ గుర్తింపు కార్డుతోపాటు వాహనాలకు స్టిక్కర్లను ముదిరించడంపై చర్చించారు.
ASF: జిల్లాలో చలి గజగజ వణికిస్తోంది. ఉష్ణోగ్రత పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిర్పూర్ (యూ)లో 6.1, తిర్యాణి 7.1, కెరమెరి 8.3, బెజ్జూరులో 9.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచుతో రహదారులు కనిపించడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
NRML: మామడ మండలంలోని దిమ్మదుర్తి ఫీడర్ పై చెట్ల కొమ్మల తొలగింపు, సబ్ స్టేషన్ల నెలవారీ మరమ్మతుల్లో భాగంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ బాలయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గం.ల వరకు 33/11 కెవి పరిధిలోని పొన్కల్, దిమ్మదుర్తి, కమల్ కోట్, అనంతపేట్, నల్దుర్తి, తదితర గ్రామాలకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
కృష్ణా: పాలకాయతిప్ప మెరైన్ ఎస్సైగా పూర్ణ మాధురి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహిస్తున్న ఏకే జిలాని రిటైర్మెంట్ కోసం ఏలూరు రేంజ్‌కు రిపోర్ట్ చేయగా బంటుమిల్లి శివారు వర్ణ గొంది తిప్ప ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న పూర్ణ మాధురి పాలకాయ తిప్పకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా మెరైన్ సిబ్బంది ఎస్సైకు స్వాగతం పలికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
కృష్ణా: దుర్గగుడి సమీపంలోని కనకదుర్గ నగర్ రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణలను ఆదివారం పోలీసులు తొలగించారు. ఆక్రమణల తొలగింపులో వెస్ట్ డివిజన్ ఏసీపీ దుర్గరావు, 1టౌన్ ఇన్స్పెక్టర్ గురు ప్రకాశ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగా ఆదివారం దుర్గగుడి సమీపంలో ఆక్రమణలు తొలగించామని ఏసీపీ దుర్గరావు చెప్పారు.