VZM: సంతకవిటి మండలం తాలాడలో ఉమారామలింగేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
VZM: రోడ్డు ప్రమాదంలో వేపాడ మండలం వీలుపర్తికి చెందిన జి.రవికుమార్(25) ఆదివారం మృతి చెందాడు. అన్నవరంలో జరిగిన తన మేనమామ పెళ్లికి వెళ్లి బైక్‌పై నానాజీ అనే వ్యక్తిని తీసుకొని వస్తున్న క్రమంలో తుని వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రమాదంలో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా నానాజీకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
VZM: చిల్లపేట అభయాంజనేయ స్వామి 13వ అలయ వార్షికోత్సవం సందర్భంగా చిల్లపేట యువకులు అధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో విశాఖపట్నం జిల్లా సంగివలస జట్టు ప్రథమ బహుమతిగా రూ.25వేలు గెలుపొందారు. ఆనందపురం జట్టు ద్వితీయ బహుమతిగా రూ.10వేలు గెలుపొందారు. చిల్లపేట గ్రామ సర్పంచ్ కోదండరామ్ విజేతలకు బహుమతులను అందజేశారు.
ELR: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు నేతలు ఆదివారం ద్వారకా తిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలో అయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావులు నివాళులర్పించారు.
అన్నయ్య: కోడూరు మండల పరిధిలోని కుమ్మరిపాలెం గ్రామంలో కోడి పందేల బరిపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదివారం కోడూరు ఎస్సై చాణిక్య రాబడిన సమాచారం ప్రకారం తమ సిబ్బంది తో కలిపి కోడి పందేల బరిపై దాడి చేసి పది మంది వ్యక్తులను, 17 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న రూ 13,980/- నగదు, నాలుగు కోడి పుంజులను స్వాధీన పరుచుకుని వారిపై కేసు నమోదు చేశారు.
కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో ఒక మద్యం దుకాణానికి ఎక్సైజ్ అధికారులు సీలు వేశారు. గతేడాది నవంబర్‌లో ఓ దుకాణం బెల్ట్ షాపుకు మద్యం సరఫరా చేసినట్లు నిర్ధారణ కావడంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కృష్ణా: పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఎస్పీ గంగాధరరావు ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్టపరమైన జీవన విధానాన్ని అవలంబించాలని సూచించారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో నేర నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఆలివ్‌బిస్ట్రో పబ్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు 20 మందిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. సండేజ్ సన్ డౌనర్ సఫారీ పేరుతో ఈవెంట్ నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ADB: గుడిహత్నూర్ మండలం నూతన ఎస్సై మహేందర్ ను సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో యువకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో యువత కీలకపాత్ర వహించాలని ఆయన పేర్కొన్నారు. యూత్ అధ్యక్షుడు జైపాల్, సావిందర్, పవన్, సునీల్, మోహన్, ఆకాష్, గౌరీ, విష్ణు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
VKB: గత ప్రభుత్వ నిర్మాణ పనుల బిల్లులు రాక తీవ్ర మనస్తాపానికి గురైన బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ చింతకింది వెంకటప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే అతడిని వికారాబాద్ పట్టణంలోని మిషన్ ఆసుపత్రికి తరలించారు.
KMR: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని ఆదివారం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్ మాట్లాడుతూ..SSA, కేజీబీవీ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఉద్యోగులు సమ్మే కాలానికి వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు.
కోనసీమ: రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ముమ్మిడివరంలో ఆదివారం అయన మాట్లాడుతూ.. ఓటర్లకు రానుపోను టిక్కెట్లు రిజర్వేషన్ చేస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇది క్షమించరాని నేరమన్నారు. ఇవి పార్టీలకతీతంగా జరిగే ఎన్నికన్నారు.
KMM: ముదిగొండ మండలంలో ఆదివారం పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీపురంలో పర్యటించిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం ప్రజలు పలు సమస్యలపై ఇచ్చిన వినతులను స్వీకరించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
JGL: MPలోని రేవా ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన వెంగళ ప్రమీల(58) మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్లలో ఉత్తరప్రదేశ్ కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఒక కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రమీల అనే మహిళ మృతి చెందింది. ఇటీవలనే ఆమె భర్త గుండెపోటుతో మృతి చెందగా.. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
మేడ్చల్: ఉప్పల్ బాగాయత్ ప్రాంతంలో ఎండు గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో అల్వాల్, వెంకటాపురంకి చెందిన అభిషేక్ కుమార్ సింగ్ అనే వ్యక్తి తన బైక్‌లో (5.147) కిలోల ఎండు గంజాయిని తీసుకెళ్తుండటంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతినిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.